తన పార్టీ భాజపాకు అనుబంధ పార్టీ అని వస్తున్న ఆరోపణలను ఖండించారు తమిళ నటుడు కమల్. 'మక్కల్ నీది మయ్యమ్' భాజపాకు " బీ " పార్టీ కాదని తమిళనాడు "ఏ" పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నందున పార్టీని లక్ష్యంగా చేసుకున్నారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కొద్ది రోజుల ముందు డీఎంకే అనుబంధ సంస్థ ముర్ సోలి భాజపా ఒత్తిడితోనే.. కమల్ హాసన్ డీఎంకేపై అవినీతి ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అవి నిలువవు:
ప్రతిపక్షాల పొత్తులపై స్పందించారు కమల్. ఎన్నికల అనంతరం గెలిచిన పార్టీల వైపు ఈ ప్రతిపక్ష పార్టీలు చేరిపోతాయని ఎద్దేవా చేశారు. అలాంటి సమయంలోనూ తన పార్టీ స్థిరంగా ప్రజల పక్షాన నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు.
"లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి ఏం చెప్పలేం, కానీ కనీసం ప్రధానినైనా మార్చాలి." అని కమల్ అన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయటం లేదని, నా వెంట మీరు ఉన్నారంటూ భారీగా హాజరైన అభిమానుల్ని ఉద్దేశించి అన్నారు కమల్. ఎన్నికలను ఎదుర్కోవడానికి వారి వద్ద నుంచి విరాళాలు కోరారు.
మీ విరాళాలు భవిష్యత్‌కు పెట్టుబడి అని ఆయన వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మా గాంధీ తన గురువని కమల్ తెలిపారు. పార్టీ స్థాపించడానికి ఆయనే స్ఫూర్తి అని అన్నారు. ప్రజా సంక్షేమమే ఎమ్ఎన్ఎమ్ పార్టీ ధ్యేయమని స్పష్టం చేశారు కమల్.
తమిళ ప్రజల శ్రేయస్సు, లౌకిక వాదం, పేదరిక నిర్మూలన, ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ స్థాయి విద్య తమ పార్టీ లక్ష్యాలని కమల్ పేర్కొన్నారు.