ఆమె భర్త ఎదురుకాల్పుల్లో అమరుడయ్యారు. భర్తను పొట్టనపెట్టుకుందని దేశాన్ని ఆడిపోసుకోలేదు ఆ ధీర వనిత. భర్తకు నివాళిగా సైన్యంలో చేరాలని నిశ్చయించుకున్నారు. భర్త పోయాడని ఏదైనా ఉద్యోగం ఇస్తే చేరారని అనుకుంటే పొరపాటే. పోటీ పరీక్షలు నెగ్గి ఆర్మీ ట్రైనింగ్ అకాడమీకి వెళ్లారు ఆమె.
మేజర్ ప్రసాద్ మహాదిక్... 2012లో సైన్యంలో చేరారు. బిహార్ రెజిమెంట్ అధికారిగా అరుణాచల్ ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దు వద్ద విధులు నిర్వర్తించేవారు. 2017 డిసెంబర్లో ఎదురుకాల్పుల్లో అమరుడయ్యారు.
"నా భర్త మరణం తర్వాత నేనేం చేయాలా అని ఆలోచించాను. ఏడుస్తూ కూర్చోలేదు. ఆయన కోసం ఏదైనా చేయాలని అనిపించింది. ఆయన అడుగు జాడల్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. ఎస్ఎస్బీకి సన్నద్ధమయ్యాను "
-గౌరీ మహాదిక్, ప్రసాద్ భార్య
మొదటి ప్రయత్నంలో విఫలమైన గౌరి పట్టువదలకుండా రెండో ప్రయత్నంలో సాధించారు. అన్ని పరీక్షల్లో మెరుగ్గా నిలిచి ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో చేరారు. 49 నెలల కఠోర శిక్షణ అనంతరం 2020 మార్చి నుంచి సైనిక అధికారిగా సేవలు అందించనున్నారు గౌరి.