పుల్వామా ఉగ్రదాడిలో 'జైషే మహ్మద్' పాత్రపై పాకిస్థాన్‌కు ఎలాంటి ఆధారాలు భారత్ అందించదని ఓ ప్రభుత్వ అధికారి అధికారికంగా తెలిపారు. అయితే పాక్ అసలు రంగు బయటపెట్టడానికి మిత్రదేశాలకు ఆ ఆధారాలు సమర్పిస్తామని ఆయన అన్నారు. గతంలో 26/11 ముంబయి ఉగ్రదాడి, పఠాన్‌కోట్ వైమానిక స్థావరం దాడుల వివరాలు పాక్‌కు సమర్పించామని తెలిపారు. ఆయితే ఈ ఉగ్రదాడులకు పాల్పడిన వారిపై దాయాది దేశం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. అందుకే పాకిస్థాన్‌కు ఆధారాలు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మిత్రదేశాలకు ఆధారాలు చూపించి పాక్ బండారం బయటపెడతామన్నారు.
ఓ అవకాశం ఇచ్చి చూద్దాం....
పుల్వామా దాడిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ స్పందించారు. ఉగ్రదాడిపై గత పాక్ ప్రభుత్వాలు సాక్ష్యాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇమ్రాన్ ఖాన్ కొత్త ప్రధాని కనుక అవకాశం ఇచ్చి చూద్దామని అభిప్రాయపడ్డారు.
"ఈ రోజుల్లో నిరక్షరాస్యులే యుద్ధం గురించి మాట్లాడుతారు. మన రెండు దేశాలు అణు సామర్థ్యం కలవి. చర్చించుకునే అవకాశం ఉన్నప్పుడు యుద్ధమనే ప్రశ్నే వద్దు."_ మెహబూబా ముఫ్తీ, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి