దక్షిణ కొరియాలో రెండు రోజులు పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్-దక్షిణ కొరియా మధ్య ఏడు కీలక ఒప్పందాలు జరిగాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మీడియా, అంకుర పరిశ్రమలు, సరిహద్దు, అంతర్జాతీయ నేరాల విచారణలో సహకారం వంటి కీలక అంశాలు అందులో ఉన్నాయి.
వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత వంటి అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో ప్రధాని మోదీ చర్చించారు. అనంతరం కొరియన్ నేషనల్ పాలసీ ఏజెన్సీ, భారత హోంశాఖ మధ్య జరిగిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
రాజకుమారిపై పోస్టల్ స్టాంప్
కొరియన్ రాజు కిమ్ సురోను పెళ్లి చేసుకున్న అయోధ్య రాజకుమారి సురిరత్నా జ్ఞాపకార్థం ఇరుదేశాలు సంయుక్తంగా పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలని ఒప్పందం చేసుకున్నాయి.
పెట్టుబడులు
భారత్‌లోని కొరియన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ప్లస్ సంస్థకు వీలుకల్పించారు. అంకుర పరిశ్రమల అభివృద్ధికి భారత్‌లో కొరియా స్టార్టప్ సెంటర్ (కేఎస్సీ)ను ఏర్పాటు చేయనున్నారు.
టీవీ ప్రసారాలకు అనుమతి
దక్షిణ కొరియాలో డీడీ ఇండియా, భారత్‌లో కేబీఎస్ వరల్డ్ ఛానళ్ల ప్రసారానికి కొరియన్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్, ప్రసార భారతి మధ్య ఒప్పందం కుదిరింది.
రహదారుల అభివృద్ధి
భారత జాతీయ రహదారుల సంస్థ, కొరియన్ ఎక్స్‌ప్రెస్‌వే కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రహదారులు, రవాణా విభాగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇరుదేశాలు సహకరించుకోనున్నాయి.