పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసే ప్రయత్నాలను ప్రధాని నరేంద్రమోదీ ఉద్ధృతం చేస్తున్నారు. వేర్పాటు వాదం, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ ఉపేక్షించదని మోదీ పునరుద్ఘాటించారు. పాక్ పేరు లేవనెత్తకుండా తీవ్ర విమర్శలు చేశారు మోదీ. భారత్‌లో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ బుధవారం పర్యటించారు. ఈ నేపథ్యంలో అరబిక్ వార్తాపత్రిక 'ఒకాజ్', ఆంగ్ల పత్రిక 'సౌదీ గజిట్'కు ఇచ్చిన ముఖాముఖిలో ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.
"సరిహద్దులో దశాబ్దాలుగా తీవ్రవాదులకు ఆశ్రయం, సహకారం అందుతోంది. ఫలితంగా భారత్ ఉగ్రవాద బాధిత దేశంగా మారుతోంది. ఉగ్రదాడుల్లో వేలమంది అమాయకులు అసువులు బాశారు. ఉగ్రదేశాలను బహిష్కరించాలి. ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేసేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాను." - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
దృఢ భాగస్వామ్యం
ఉగ్రవాదంపై పోరు, భద్రత, రక్షణ రంగాల్లో సౌదీతో ఎన్నో ఏళ్లుగా మంచి సంబంధాలను కొనసాగిస్తున్నామని మోదీ తెలిపారు. ముఖ్యంగా సముద్ర భద్రత, హవాలా, మత్తు పదార్థాల రవాణా, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు వంటి విషయాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర ఒప్పందాలు ఉన్నాయని వివరించారు. మిత్ర దేశాల్లో సౌదీకి ప్రముఖ స్థానం కల్పించామని స్పష్టం చేశారు.
మండలి ఏర్పాటుకు కృషి
వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ప్రధాని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇటీవలే నిబంధనలను రూపొందించింది సౌదీ అరేబియా. రెండు దేశాల్లో శాంతి, స్థిరత్వం, భద్రతలే లక్ష్యంగా ఈ మండలి పని చేస్తుందన్నారు మోదీ.
పెట్టుబడులు అభినందనీయం
రత్నగిరి శుద్ధి కేంద్రానికి 44 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన సౌదీ ఆరామ్కో కంపెనీని మోదీ అభినందించారు. భారత్‌లో పెట్టుబడుల విషయంలో సౌదీ కంపెనీలకు ప్రోత్సాహం లభిస్తుందని హామీ ఇచ్చారు.