పుల్వామా దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత స్పందించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. దాడితో తమకెలాంటి సంబంధం లేదని ఎప్పటిలాగే బుకాయించారు.
భారత్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, పాక్‌కు వ్యతిరేకంగా ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధమని ప్రకటించారు ఇమ్రాన్. సౌదీ రాజుతో సమావేశాల కారణంగా ఘటనపై ఆలస్యంగా స్పందిస్తున్నామని వివరణ ఇచ్చారు.
"ఎలాంటి ఆధారాలు లేకుండా పాక్‌పై భారత ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. ఇందులో పాకిస్థాన్‌కు ఏం లాభమో నాకర్థం కావట్లేదు. ఉగ్రవాదంతో 15 ఏళ్లలో వేల మంది పాకిస్థానీలు మరణించారు. ఇప్పుడిప్పుడే పాక్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎందుకు దాడులు చేస్తాం. మీ (భారత్) దగ్గర పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆధారాలుంటే చెప్పండి. మేమే చర్యలు తీసుకుంటాం. కశ్మీర్‌పై ఎప్పుడు చర్చ వచ్చినా పాక్‌ను ఆయుధంగా చేసుకోవటం అలవాటైపోయింది. భారత్‌లో చాలా మంది అంటున్నారు. పాక్‌కు గుణపాఠం చెప్పాలి, ప్రతీకారం తీర్చుకోవాలని... ఇదేం పద్దతి. ఏకపక్షంగా తీర్పునివ్వటం ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో ఉంది. రెండో విషయం.. భారత్ దాడులకు పాల్పడితే ఏ మాత్రం ఆలోచించం. తప్పనిసరిగా ప్రతిఘటిస్తాం. "
- ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి