పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన జాతీయ భద్రతా మండలి సమావేశమైంది. భారత్ పాక్‌పై దాడి చేస్తే పూర్తిస్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆ దేశ సైన్యాన్ని ఇమ్రాన్ ఆదేశించారు.
పాక్ ఆధారిత 'జైష్ ఏ మహమ్మద్' జరిపిన పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాక్ ఉగ్ర చర్యపై ప్రతీకారం తీర్పుకోవడానికి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
ప్రతిచర్యగా గురువారం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సీ)తో సమావేశమయ్యారు. సైన్యాధిపతి జైన్ ఖమర్ జావెద్‌తో ఇమ్రాన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం పాక్ ప్రభుత్వానికి తమ ప్రజలను సంరక్షించుకునే శక్తి ఉందని, అందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.
"ఇది నూతన పాకిస్థాన్. మా ప్రజలను సంరక్షించుకునే సామర్థ్యం మాకుంది. ఇదే మా ప్రజలకు మేమిచ్చే భరోసా" - ఇమ్రాన్‌ఖాన్, పాక్ ప్రధాని
చెప్పకనే చెప్పిన ఇమ్రాన్...
పాక్‌లో తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకోవాలని పాక్ హోంశాఖను, భద్రతా సంస్థలను ఇమ్రాన్ ఆదేశించారు. దీంతో పాక్‌లో ఉగ్రవాద బీజాలు ఉన్నాయని ఇమ్రాన్ చెప్పకనే చెప్పినట్లైంది.
పుల్వామా దాడిలో పాక్ ప్రమేయం లేదని ఇమ్రాన్ పునరుద్ఘాటించారు. ఈ దాడి ప్రణాళిక, అమలుతో పాక్‌కు సంబంధం లేదని ఆయన చెప్పారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు తమ వంతు సహకారం అందించాలని ఇమ్రాన్ కోరారు.