భారత సైనిక శిబిరాలపై దాడికి పాకిస్థాన్ వాయుసేన యత్నించిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ప్రకటించారు. దాయాది దేశ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు.
"భారత్ చేసిన ఉగ్రవాద వ్యతిరేక మెరుపుదాడులకు ఈ రోజు ఉదయం పాక్ స్పందించింది. భారత శిబిరాలపై తన వాయుసేనతో దాడికి యత్నించింది. మనం అప్రమత్తంగా వ్యవహరించి పాకిస్థాన్ చర్యలను తిప్పికొట్టాం. పాక్ విమానాలను గుర్తించిన భారత వాయుసేన వెంటనే స్పందించింది. ఈ ఘటనలో ఒక పాక్ ఫైటర్జెట్ను మిగ్-21 బైసన్ కూల్చింది. కూలిన విమానం పాక్ వైపు పడటాన్ని మన సిబ్బంది గమనించారు."
---- రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి.
పాక్ వాయుసేనతో జరిగిన పోరులో భారత్ ఒక మిగ్-21 విమానాన్ని కోల్పోయిందని ధృవీకరించారు రవీశ్.
మిగ్-21లో అభినందన్...
మిగ్-21ను నడిపింది ఐఏఎఫ్ పైలట్ అభినందన్. అయన ఆచూకీపై ఎటువంటి సమాచారం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పైలట్ తమ ఆధీనంలో ఉన్నాడని పాక్ ప్రకటించిన కొద్ది గంటలకు విదేశాంగ శాఖ ఈ మేరకు స్పందించింది. పాక్ అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని రవీశ్ వెల్లడించారు.
"ఈ పూర్తి వ్యవహారంలో దురదృష్టవశాత్తు ఒక మిగ్-21 విమానాన్ని కోల్పోయాం. పైలట్ కనపడట్లేదు. పైలట్ తమ కస్టడీలోనే ఉన్నట్టు పాక్ ప్రకటించింది."
---- రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ ప్రతినిధి
కళ్లకు గంతలు కట్టిన ఓ మనిషి దృశ్యాలను పాకిస్థాన్ సైన్యం విడుదల చేసింది. అతడే అభినందన్ అని పాక్ చెబుతోంది. అయితే ఆ ప్రకటనలోని నిజానిజాలు తేలాల్సి ఉందని రవీశ్ చెప్పారు.