అనిల్ అంబానీ, విజయ్‌మాల్యా లాంటి బడా పారిశ్రామిక వేత్తలకు రూ.3.5లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ... రైతులకు మాత్రం రోజుకు రూ. 3.50 చెల్లిస్తున్నారని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ఉన్న రాహుల్... 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి ఖాతాలో కనీస ఆదాయాన్ని జమ చేస్తామని పునరుద్ఘాటించారు.
కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో... ఐదు ఎకరాల వరకున్న ప్రతి రైతుకు రూ. 6 వేలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం. రాజ్యసభలో ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీలు బల్లలు చరిచారు. ఇది అంతగా సంతోషించాల్సిన అంశమా? అని రాహుల్ ప్రశ్నించారు.
ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు, ఉపాధి కల్పన లాంటి హామీలను నెరవేర్చటంలో మోదీ సర్కారు విఫలమైందని అని రాహుల్ విమర్శించారు.
నోట్ల రద్దుపైనా వాడి-వేడి విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు. నోట్ల రద్దు సమయంలో సాధారణ పౌరులే బ్యాంకుల ముందు నిలబడ్డారు కానీ అనిల్ అంబానీ, విజయ్‌మాల్యా, మెహుల్ చోక్సీలు నిలబడలేదని వ్యాఖ్యానించారు. ఇది నల్లధనంపై యుద్దం అయితే సామాన్య ప్రజలకు కష్టాలెందుకు? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.
నోట్ల రద్దు తర్వాత అర్ధరాత్రి హాడావిడిగా 'గబ్బర్‌సింగ్ ట్యాక్స్' ప్రవేశపెట్టి సామాన్యుల నడ్డి విరిచారని రాహుల్ ఎద్దేవా చేశారు.
భాజపా, ఆర్ఎస్ఎస్, రమణ్సింగ్ల దగ్గర డబ్బులకు కొదవ లేదు. మీ డబ్బులు తీసుకొని వారి జేబుల్లో, వారి మిత్రుల జేబుల్లో దాస్తున్నారు. 15 మందికి చెందిన 3 లక్షల కోట్ల రూపాయల రుణాన్ని మోదీ మాఫీ చేశారు. వారిలో అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, లలిత్ మోదీ లాంటి వారు ఉన్నారు. కాపాలాదారు చోరుల రుణాలు మాత్రమే మాఫీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ రైతుల రుణాల్ని మాఫీ చేస్తోంది. - రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు