ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్‌కు మరో అగ్రదేశం మద్దతు ప్రకటించింది. జైషే మహమ్మద్ అగ్రనేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని ఫ్రాన్స్ కోరనుంది. ఆంక్షల జాబితా 1267లోనూ మసూద్‌ను చేర్చేలా కృషి చేయనుంది. పారిస్‌లో జరగబోయే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో పాక్‌ను గ్రే లిస్ట్‌లోనే కొనసాగించాలని ప్రతిపాదించనుంది ఫ్రాన్స్.
"మేము ఈ విషయంలో ఐరాసపై ఒత్తిడి తెస్తున్నాం. మసూద్ అజర్‌ను ఆంక్షల జాబితాలో చేర్చాలని రెండేళ్లుగా ఐక్యరాజ్య సమితిలో పోరాడుతున్నాం. దీనిపై న్యూయార్క్‌తో చర్చిస్తున్నాం. పుల్వామాలో భయంకర దాడికి వ్యతిరేకంగా తప్పకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. భారత్ భవిష్యత్తు బాగుండేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం."
- అలెగ్జాండర్ జీగ్లర్, భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి
ఇది రెండోసారి
పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యులమని జైషే సంస్థ ప్రకటించింది. ఫలితంగా ఐరాసలో పిటిషన్ వేసేందుకు మరోసారి సిద్ధమైంది ఫ్రాన్స్. 2017లోనూ అమెరికా, బ్రిటన్ మద్దతుతో మొదటిసారి అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఆ దేశం ఐరాస భద్రతా మండలిలో ప్రతిపాదనలు చేసింది.
వీటోతో చైనా అడ్డంకులు
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఇప్పటికే 2009, 2016లో ఐరాసలో రెండు సార్లు ప్రతిపాదించింది. చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి అన్ని సార్లూ భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి నిరసనగా భారత్ ప్రవేశపెట్టిన తీర్మానానికి చైనా అడ్డుగా నిలిచింది.
గ్రే జాబితాలోనే పాక్
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ గ్రే జాబితాలో పాక్‌ను 2018 జూన్‌లో చేర్చారు. హవాలా, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని పాక్ నిరోధించగలిగితే, 2019 అక్టోబర్‌లో ఆ దేశంపై ఈ ఆంక్షలను ఎత్తేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండకూడదని ప్యారిస్‌లో జరగబోయే టాస్క్‌ఫోర్స్ సదస్సులో ఇతర దేశాలను కోరనుంది ఫ్రాన్స్.
దీనిపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌తో ఫ్రాన్స్ విదేశాంగ సలహాదారు ఫిలిప్ ఎటైన్న్ సంప్రదింపులు జరిపారు. పుల్వామా దాడితో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో భారత్ దూసుకెళుతోంది. ఇప్పటికే భారత్‌కు అండగా ఉంటామని అమెరికా, ఇజ్రాయెల్, రష్యా ప్రకటించాయి.