పీఎం-కిసాన్ పథకం వల్ల రైతులకు చాలా ఉపయోగాలున్నాయన్నారు కేంద్ర ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణియన్. ఈ పథకం వల్ల వారి ఆదాయ స్థితి మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఎప్పుడు ప్రకటించింది..?
'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిథి యోజన' పథకాన్ని 2019-20 బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. దీని వల్ల దాదపు 12 కోట్ల మంది సన్న,చిన్న కారు రైతులు సంవత్సరానికి 6 వేల రూపాయిల చొప్పున ఆదాయం పొందనున్నారు. రెండు ఎకరాలు వరకు సాగు చేసే రైతులకు ఈ సాయం వర్తించనుంది.
మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో వ్యవసాయానికి మద్దతు చాలా తక్కువ. ఈ విషయం ఓఈసీడీ సర్వేలోనూ స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వం సాయంతో పరిస్థితిలో మార్పు వస్తుంది. 2015-16 లెక్కల ప్రకారం రైతుల సంవత్సర సగటు ఆదాయం 30 వేల రూపాయలు. ప్రభుత్వం సంవత్సరానికి 6 వేల రూపాయిలు అందిస్తుంది. అంటే ప్రభుత్వం 20 శాతం సొమ్ముని రైతుల ఖాతాలో జమ చేస్తుంది.
ఈ రంగంలో పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో తెలియని పరిస్థితి , అందుకే చాలా దేశాలు అధిక మద్దతునిస్తాయి. 125 కోట్ల మందికి ఆహారాన్ని అందించే అత్యంత ప్రాధాన్య రంగం ఇది.
- కె.వి సుబ్రమణియన్, కేంద్ర ఆర్థిక సలహాదారు.
ఎప్పటి నుంచి ప్రారంభం..?
ఫిబ్రవరి 24 న ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్పూర్ నుంచి ఈ పథకం ప్రారంభించనున్నారు. ఆ రోజే మొదటి దఫా సాయాన్ని చెల్లిస్తామని సుబ్రమణియన్ తెలిపారు. ఏప్రిల్ 1న రెండో దఫా చెల్లింపులు జరుపుతామని వెల్లడించారు.