పుల్వామాలో సైనికులపై ఉగ్రదాడి ప్రజల హృదయాల్లో అగ్ని జ్వాలలు రాజేసిందని తాను గ్రహించానని మోదీ వ్యాఖ్యానించారు. ప్రజల్లాగే తన గుండె రగిలిపోతోందని భావోద్వేగంతో ప్రసంగించారు. బిహార్‌కు చెందిన వీర జవాన్లు సంజయ్ కుమార్ సిన్హా, రతన్ కుమార్ ఠాకూర్ మృతికి సంతాపం ప్రకటించారు. వారి కుటంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బిహార్ బరౌలీలో పర్యటించారు మోదీ. పట్నా మెట్రో రైలు ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు.
బిహార్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.వేలకోట్లు కేటాయించిందని ప్రధాని మోదీ తెలిపారు.
బిహార్‌ను అత్యున్నతంగా అభివృద్ధి చేసేందుకే 'ప్రధాన మంత్రి ఉర్జా గంగా యోజనా'ను ప్రవేశ పెట్టామని మోదీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఉత్తర ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ్ బంగ, ఒడిశా రాష్ట్రాలు గ్యాస్ పైప్‌లైన్ ద్వారా అనుసంధానమవుతాయని తెలిపారు ప్రధాని.
" దేశం కోసం ప్రాణాలను అర్పించిన పట్నాకు చెందిన జవాను సంజయ్ కుమార్ సిన్హా, బావ్గర్పుర్ జవాను రతన్ కుమార్ ఠాకూర్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. దేశ ప్రజల హృదయాలు రగిలిపోతున్నాయని నాకు తెలుసు, మీలాగే నా గుండే రగులుతోంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి