స్వీడన్ టెలికాం దిగ్గజం ఎరిక్సన్ సంస్థకు రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్) వడ్డీతో రూ.550 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కోర్టులో జమచేసిన రూ.118 మినహా మిగతా రూ. 453 కోట్ల బకాయిలను 4 వారాల్లోగా ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఆర్‌కామ్ అధినేత అనిల్ అంబానీతో పాటు, రిలయన్స్ టెలికాం ఛైర్మన్ సతీష్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ ఛైర్పర్సన్ ఛాయా విరాణీకి మూడు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.
అనిల్ దోషి..
కోర్టు ధిక్కరణ కేసులో అనిల్ అంబానీ సహా మిగతా ఇద్దరినీ దోషులుగా తేల్చింది సర్వోన్నత న్యాయస్థానం. బకాయిలు చెల్లించాలని గతేడాదే కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ఈ ముగ్గురు ధిక్కరణకు పాల్పడ్డారని జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, వినీత్ శరణ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ టెలీకమ్యూనికేషన్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ సంస్థలకు చెరో రూ.కోటి రూపాయల జరిమానా విధించింది. నాలుగు వారాల్లో చెల్లించకపోతే మరో నెలరోజుల జైలుశిక్ష తప్పదని హెచ్చరిచింది.
క్షమాపణలు చెల్లవు...
ఆర్‌కామ్ ఇప్పటికే కోర్టులో జమచేసిన రూ. 118 కోట్లను వారంలోగా ఎరిక్సన్కు అందజేస్తామని తెలిపింది. ఒకవేళ రిలయన్స్ సంస్థలు క్షమాపణ కోరినా... కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసినందున పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
గతేడాదే చివరి అవకాశం!
ఎరిక్సన్ బకాయిలు చెల్లించేందుకు గతేడాది అక్టోబర్ 23న ఆర్‌కామ్ సంస్థకు సుప్రీం చివరి అవకాశమిచ్చింది. 15 డిసెంబర్ 2018 లోగా చెల్లించకపోతే ఏడాదికి 12 శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుందని తీర్పునిచ్చింది. తీర్పులో పేర్కొన్న 120 రోజల గడువు ముగిసినా బకాయిలు చెల్లించేందుకు మరో 60 రోజులు పెంచింది సుప్రీం. అయినప్పటికీ ఈ మూడు రిలయన్స్ సంస్థలు స్పందించలేదు. అందుకే నాలుగు వారాల్లోగా పూర్తి బకాయిలు చెల్లించాలని లేకపోతే జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.
ఇరుసంస్థల వాదనలు...
" రఫేల్‌తో పాటు ఇతర దేశీయ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆర్‌కామ్ వద్ద నగదు ఉంది. కానీ, కోర్టు ఆదేశాల ప్రకారం ఎరిక్సన్కు బకాయిలు చెల్లించేందుకు మాత్రం ఆర్‌కామ్ వద్ద డబ్బు లేదు."
- దుశ్యంత్ దవే, ఎరికసన్ సంస్థ తరుఫు న్యాయవాది
" దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నాం. కోర్టు ఆదేశాల మేరకు ఎరిక్సన్ సంస్థకు ఇవ్వాల్సిన పూర్తి బకాయిలను ఆర్‌కామ్ సంస్థ చెల్లిస్తుందని ఆశిస్తున్నా."
- ముకుల్ రోహిత్గి, అనిల్ అంబానీ తరుఫు న్యాయవాది
ఇదీ ఒప్పందం...
7 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా ఆర్‌కామ్ వినియోగాలను విస్తరించేందుకు 2014లో ఎరిక్సన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం తమకు చెల్లించాలని బకాయిలను ఆర్‌కామ్ చెల్లించలేదని ఎరిక్సన్ సంస్థ సుప్రీంను గతేడాది ఆశ్రయించింది.
ఇదీ చూడండి...లేదంటే జైలుకే