భారత్లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా నిలుస్తాయని అమెరికాకు చెందిన నిపుణుడు మిలాన్ వైష్ణవ్ అంచనా వేశారు. చాలా సంవత్సరాల నుంచి భారతదేశ ఎన్నికల ఖర్చు పై వైష్ణవ్ పరిశోధనలు చేస్తున్నారు.
"2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 6.5 బిలియన్ డాలర్లు ఖర్చయింది. అదే 2014లో భారత్లో 5 బిలియన్ డాలర్ల వ్యయమైంది. ఈ రెండింటి లెక్కలను దాటి 2019 సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే ఖరీదైనవిగా నిలవనున్నాయి. ప్రస్తుతం ప్రజలు ఎటువైపు ఉన్నారో చెప్పలేని పరిస్థితి. ఫలితంగా పార్టీలు లెక్కకు మించి ఖర్చు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరు గెలుస్తారో దేవుడెరుగు కానీ ఎన్నికలు మాత్రం వ్యయభరితమే. ప్రజాస్వామ్య దేశాల పరంగా చూసిన ఈ ఎన్నికలే ఖరీదైనవిగా నిలుస్తాయి."
-మిలాన్ వైష్ణవ్, అసియా విభాగం డైరెక్టర్, ఇంటర్నేషనల్ పీస్ థింక్ ట్యాంక్
రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత ఉండదన్నారు వైష్ణవ్. నిధులు ఎక్కడనుంచి వస్తున్నాయో, ఎవరిస్తున్నారో పార్టీలు బహిర్గతం చేయవని తెలిపారు. స్వలాభం కోసం కొంతమంది నిధులిస్తారని, వారి పేర్లను పార్టీలు చెప్పవని ఆయన పేర్కొన్నారు.
పార్టీలకు నిధుల ప్రవాహాన్ని తగ్గించేందుకు ఈసీ ప్రవేశ పెట్టిన ఎలక్టోరల్ బాండ్లు అంత ప్రభావం చూపట్లేదని వైష్ణవ్ అన్నారు.