రాజస్థాన్‌లోని థార్ ఎడారి పండుగ శోభతో కళకళలాడింది. ప్రతియేటా ఫిబ్రవరిలో జరుపుకునే 'ఎడారి పండుగ' జైసల్మీర్‌లో ఘనంగా జరిగింది. జైసల్మీర్‌కు 42 కిలోమీటర్ల దూరంలో థార్ ఎడారిలో ఉన్న శామ్ డూన్స్ క్యాంప్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని నింపింది. ఫిబ్రవరి 17 నుంచి 19 వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో బీఎస్ఎఫ్(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) జవాన్లు ఒంటెలపై చేసిన విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక సంప్రదాయం ఉట్టిపడేలా సాగిన నృత్యాలు, గేయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఎందుకు జరుపుకుంటారు?
శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన విధంగా యాదవ వర్గానికి చెందిన రావల్ జైశ్వాల్ జైసల్మీర్‌లో 1196లో రాజ్యాన్ని ఏర్పరచుకుని పరిపాలించాడు. అప్పటి నుంచి శ్రీకృష్ణుని మాటలను గుర్తుచేసుకుంటూ ప్రతియేటా ఫిబ్రవరిలో అనాదిగా ఈ ఉత్సవాలను జరుపుతున్నారు.