సరికొత్త విధి, విధానాలు కల్గిన నూతన భారత దేశంలో భద్రతా బలగాలపై దుశ్చర్యలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పుల్వామా ఘటన అనంతరం దేశం కోపంతో రగిలిపోతోందని అన్నారు. అందరూ సంయమనంతో వ్యవహరించాలని కోరారు.
మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ధూలేలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ప్రధాని. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగలో ప్రసంగించారు.
"పుల్వామా ఉగ్రదాడిపై దేశ ప్రజలంతా ఆక్రోశంతో ఉన్నారు. ఒకవైపు కోపంతో రగిలిపోతున్నారు. మరోవైపు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. ఇది సంయమనంతో ఉండాల్సిన సమయం. విచారించాల్సిన సమయం. దుఃఖించాల్సిన సమయం. భారత్ సరికొత్త విధి, విధానాలు కల్గిన దేశం. ఈ విషయం ఇప్పడు ప్రపంచానికి తెలుస్తుంది. దేశానికి ఎవరైనా కీడు తలపెడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మన బలగాలు ఈ విషయాన్ని ఇదివరకే నిరూపించాయి. ఇప్పుడు మరోసారి రుజువు చేసేందుకు ఏ అవకాశాన్ని వదులుకోము."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి