ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అడ్డుకుంటున్నారని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రెండు రోజులుగా రాజ్‌నివాస్ ముందు ధర్నా చేస్తున్నారు. ఈ పరిణామాలు కిరణ్ బేడీ, నారాయణ స్వామి మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.
39 సమస్యలను పొందుపరుస్తూ వారం క్రితమే లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు లేఖ పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేదని నారాయణ స్వామి తెలిపారు. అందుకే ధర్నాకు కూర్చున్నామని వివరించింది.
" 39 సమస్యలను పేర్కొంటూ గత వారమే లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాశాం. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించినవి అందులోనే ఉన్నాయి. వాటిపై ఆమె నిర్లక్ష్యం వహిస్తున్నారు. నియంతృత్వంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తున్నారు. ప్రధాని మోదీ ఆమెను ప్రోత్సహిస్తున్నారు. ప్రధాని వద్ద మంచి పేరు సంపాదించాలనే ఆమె ఇలా చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి సైతం ఆమెతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మా లేఖపై స్పందించకపోవటం వల్లే ధర్నా చేస్తున్నాం. అన్ని సమస్యలను త్వరితగతంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. రాజ్‌భవన్ నుంచి వెళ్లిపోయి ప్రభుత్వాన్ని, పుదుచ్చేరి ప్రజలను అవమానించారు. మా ధర్నా కొనసాగుతుంది. "
- నారాయణ స్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి
ధర్నాపై సమాచారం లేదు
రెండు రోజులుగా రాజ్‌నివాస్ వద్ద ముఖ్యమంత్రి చేపట్టిన ధర్నాపై గవర్నర్ కిరణ్‌బేడీ స్పందించారు. లేఖ రాసిన మాట వాస్తవమేనన్నారు. కానీ అందులో పేర్కొన్న సమస్యలు కొన్ని పరిష్కారమయ్యాయని, కొన్ని ఇప్పుడు లేవని తెలిపారు. ధర్నాపై ఎలాంటి సమాచారం లేదన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్నందున 20న చర్చలకు ఆహ్వానించామని తెలిపారు.
" 36 సమస్యలు పేర్కొంటూ ఫిబ్రవరి 7న లేఖ రాశారు. అందులో కొన్ని ఇప్పుడు లేవు, కొన్ని పరిష్కారమయ్యాయి. నాకు 8న లేఖ అందింది. నిన్న ధర్నాలో కూర్చొని తన డిమాండ్లకు సమాధానమివ్వాలని కోరారు. 13 లోపు స్పందించకుంటే ధర్నాలో కుర్చుంటానని లేఖలో ఎక్కడా లేదు. ఈ రోజు నుంచి 20 వరకు పర్యటనలో ఉన్నందున 21న చర్చలకు ఆహ్వానించాం. ఆయన ఇప్పటికీ అక్కడే కూర్చుని ఉన్నారు. ప్రజలు శిరస్త్రాణం ధరించకుండా అడ్డుకుంటున్నారు. "
- కిరణ్ బేడీ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్.