తన నుంచి అద్భుతాలు ఆశించవద్దని, కింది స్థాయిలో పార్టీ బలోపేతం చేస్తేనే ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన చేయగలమని తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ బుందేల్‌ఖండ్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆమె పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
"నేను పైనుంచి అద్భుతాలు చేయలేను. కిందిస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కృషిచేయాలి. ఈ రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు మీ మద్దతు నాకు అవసరం."_ ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ
ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రియాంక హెచ్చరించారు. తన ఆధ్వర్యంలోని 19 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి అనుసరిచాల్సిన వ్యూహాలపై ఆమె కార్యకర్తలతో చర్చించారు.
ఆమెను చూస్తుంటే నాన్నమ్మ ఇందిరాగాంధీ గుర్తుకు వస్తున్నారని ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులు ప్రియంకతో చెప్పారు. ఆమెకు రాణీ లక్ష్మీబాయి విగ్రహాన్ని బహూకరించారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రియాంక, జ్యోతిరాదిత్య సింధియాలకు తూర్పు, పశ్చిమ యూపీ బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
భాజపా, ఎస్పీ-బీఎస్పీలకు ధీటుగా పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.