తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సార్వత్రిక ఎన్నికలకు సమీపిస్తున్న నేపథ్యంలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య లోక్‌సభ సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చింది. మిత్ర పక్షమైన కాంగ్రెస్‌కు పుదుచ్చేరిలో 1 , తమిళనాడులో 9 లోక్‌సభ స్థానాలు కేటాయిస్తూ డీఎంకే నిర్ణయం తీసుకుంది.
అన్నాడీఎంకే, భాజపా, పీఎంకే పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీకి 5, పీఎంకేకు 7 సీట్లు కేటాయించింది అన్నా డీఎంకే.
కాంగ్రెస్, డీఎంకే పార్టీలూ కూటమిగా ఏర్పడి వ్యూహాలకు పదునుపెట్టాయి.
డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో సీట్ల పంపకంపై చర్చ జరిగింది. ఇందులో డీఎంకే అధినేత స్టాలిన్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్, టీఎన్‌సీసీ అధినేత కేఎస్ అళగిరి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు ఏయే స్థానాలు కేటాయించిందీ తరువాత ప్రకటిస్తామని స్టాలిన్ తెలిపారు. త్వరలోనే మిగతా మిత్రపక్షాల సీట్ల కేటాయింపును ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
పుదుచ్చేరిలో 1, తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
అన్నాడీఎంకే కూటమిపై కాంగ్రెస్ విమర్శలు
భాజపా, అన్నా డీఎంకే, పీఎంకే కూటమికి ఒక సిద్ధాంతం లేదని, అది ఒక అనైతిక కూటమి అని తమిళనాడు ఏఐసీసీ కార్యదర్శి సంజయ్ దత్ విమర్శించారు. మొన్నటి వరకు ఇరుపార్టీలను విమర్శించిన పీఎంకే ఇప్పుడు వాటితోనే జతకట్టడం విలువలు లేని రాజకీయమే అని విమర్శించారు.
భాజపా వ్యతిరేక మహాకూటమిని కల్తీ కూటమిగా అభివర్ణించిన ప్రధాని మోదీ..... ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకే, పీఎంకేలతో పొత్తు పెట్టుకోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.