నేషనల్ హెరాల్డ్ భవంతిని ఖాళీ చేయాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.
దేశ రాజధానిలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ముద్రణ కార్యాకలాపాలు జరగడం లేదనేకారణంతో 56ఏళ్ల లీజును రద్దు చేస్తూ గతేడాది అక్టోబరు 30న నోటీసులు జారీ చేసింది కేంద్రం. దాన్ని వ్యతిరేకిస్తూ ఏజేఎల్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ జడ్జి ఈ కేసు వాదనలను విని, కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. నేషనల్ హెరాల్డ్ భవనాన్ని రెండు వారాల్లోగా ఖాళీ చేయాలని, లేదంటే చట్టపరంగా చర్యలు ఎదుర్కొవాల్సి వస్తోందని గతేడాది డిసెంబర్ 21న తీర్పునిచ్చారు. దాన్ని సవాల్ చేసింది ఏజేఎల్.
వాదనలు..
హెరాల్డ్ భవనంలో ముద్రణా కార్యకలపాలపై జూన్ 2018కు ముందు వరకూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు తెలుపలేదని పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టుకు వివరించారు ఏజేఎల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ. ఏజేఎల్లోఎక్కువ వాటా యంగ్ ఇండియా సంస్థకు బదిలీ అయినంత మాత్రాన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,సోనియా గాంధీ హెరాల్డ్ భవనానికి యజమానులు అయ్యే అవకాశమే లేదని చెప్పారు.
ఏజేఎల్ నుంచి బదిలీ అయిన షేర్ల ప్రక్రియను పరిశీలించి అసలు యజమానులెవరో నిర్ణయించాలని కేంద్రం తరఫున వాదించారు సోలిసిటర్ జనరల్ తుషర్ మెహతా. హెరాల్డ్ భవనం ప్రచురణ కార్యకలాపాలు నిర్వహించేందుకు మాత్రమే అద్దెకు ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం నుంచే హెరాల్డ్‌లో ముద్రణ కార్యక్రమాలు జరగడంలేదని కోర్టుకు తెలిపారు.
ఫిబ్రవరి 18 వరకు ఇరువురి వాదనలు విన్న దిల్లీ హైకోర్టు తీర్పును 28వ తేదీకి(నేటికి)వాయిదా వేసింది.