పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో రక్షణశాఖ దిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తోంది. దేశం ముందున్న భద్రతా సవాళ్లపై చర్చే ప్రధానాంశంగా జరుగుతున్న ఈ భేటీకి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. 42 దేశాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత డిఫెన్స్ అటాచీలూ పాల్గొంటున్న ఈ సమావేశం నేడు, రేపు కొనసాగనుంది.
భారత త్రివిధ దళాల నుంచి వేర్వేరు దేశాల్లో బాధ్యతల నిర్వర్తిస్తున్నవారిని డిఫెన్స్ అటాచీలు అంటారు.
పుల్వామా ఉగ్రదాడి అనంతరం రక్షణ శాఖ నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్థాన్‌తో అనుసరించాల్సిన వైఖరి, సరిహద్దులో పరిస్థితిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. చైనా సరిహద్దుల్లో వ్యూహాత్మక సమస్యలపైనా సమాలోచనలు సాగుతున్నట్లు సమాచారం.
రక్షణపరంగా అంతర్జాతీయ స్థాయిలో అమలుచేయాల్సిన వ్యూహంపైనా ఈ సమావేశంలో చర్చిస్తారు. డిఫెన్స్ అటాచీలు... తాము విధులు నిర్వర్తించే దేశాలు భారత్‌పట్ల అనుసరించే వైఖరిపై నివేదించనున్నారు.