పాక్ ఉగ్రవాద శిబిరాల్లో భారత వైమానిక దాడులపై ప్రతిస్పందించింది పొరుగుదేశం చైనా. పాక్, భారత్లు నిగ్రహంతో ఉండాలని హితవు పలికింది. అంతర్జాతీయ సంఘాల సహకారంతోనే భారత్ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చింది.
"దక్షిణ ఆసియాలో పాక్, భారత్లు ముఖ్యమైన దేశాలు. రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం కొనసాగేందుకు ఆరోగ్యకరమైన సంబంధాలు, పరస్పర సహకారం అవసరం. ఇరు దేశాలు దౌత్య సహకారానికి కృషి చేయాలి"
-లూ కాంగ్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు పరస్పర సహకారంపై... పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ఫోన్ సంభాషణలో అభిప్రాయపడినట్లు లూ కాంగ్ వెల్లడించారు.
పుల్వామా దాడిపై ఐరాస ప్రకటనకు వారం పాటు చైనా మోకాలడ్డిన విషయం విదితమే. ఈ సమయంలో చైనా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దౌత్య సంబంధాలతోనే...
వాయుదాడిపై బ్రిటన్ స్పందించింది. దౌత్య సంబంధాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అభిప్రాయపడింది. బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి జెరేమీ హంట్ భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్తో ఫోన్లో సంభాషించారు.
"రెండు దేశాలతోనూ బ్రిటన్కు సత్సంబంధాలున్నాయి. ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేయాలి. ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంపొందించాలి. "-జెరేమీ హంట్, బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి