పుల్వామా ఉగ్రదాడిని అత్యంత హేయమైన, పిరికిపంద చర్యగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. 4వ భారత్ -ఆసియా ఎక్స్పో సమావేశంలో ప్రసంగించిన రాజ్నాథ్ తీవ్రవాదంపై పోరుకు భారత్కు సహకరించాలని కోరారు.
"ఈ వేదిక ద్వారా ఫిబ్రవరి 14న పుల్వామాలో మా భద్రతా దళాలపై జరిగిన అత్యంత హేయమైన, పిరికిపంద తీవ్రవాద దాడిని ఖండిస్తున్నాను. దేశ ప్రజలందరి తరపున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. భారత ప్రభుత్వం దేశ భద్రతా వ్యవస్థ రక్షణకు కావాల్సిన అన్ని చర్యలను చేపడుతోంది. తీవ్రవాదంపై పోరుకు కట్టుబడి ఉన్నాం. అంతర్జాతీయ సమాజంతో పాటు, ఆసియా దేశాలు తీవ్రవాదం, తీవ్రవాద సంస్థలపై భారత్ చేస్తోన్న పోరుకు సహకరించాలని కోరుతున్నాను."
- రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి
వ్యాపార, వాణిజ్య అభివృద్ధికి శాంతియుత వాతావరణం, భద్రత అత్యంత ముఖ్యమని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక సంబంధాలు ఆసియా దేశాలతో ఎప్పటినుంచో బలంగా ఉన్నాయని, మోదీ ఆలోచనలు వాటిని మరింత బలోపేతం చేశాయని కేంద్ర హోంమంత్రి వెల్లడించారు. భారత ఈశాన్య రాష్ట్రాలు, ఆసియా దేశాలతో వాణిజ్యంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయన్నారు.