'ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం' సమాచారం తెలుసుకునేందుకు ఆర్టీఐ చట్టం కింద పౌరులకు హక్కు ఉందని కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రూ.10 రుసుము చెల్లించి 'ఈవీఎమ్'ల సమాచారం పొందవచ్చని తెలిపింది.
అయితే సెక్షన్ 8(1) (డీ) ప్రకారం ఈవీఎమ్లలో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ వాణిజ్య, మేధో హక్కులు కలిగి ఉన్న తృతీయ పక్షానిదని, అందువల్ల దీనిని బహిర్గతం చేయడం నిబంధనలకు విరుద్ధమని సీఐసీ స్పష్టం చేసింది. బహిర్గతం చేయడం ద్వారా ప్రజా ప్రయోజనం ఉందని తృతీయ పక్షం భావిస్తే అప్పుడు వారి అనుమతి ప్రకారం తెలియజేయవచ్చని సీఐసీ పేర్కొంది.
ఆర్టీఐ చట్టం ద్వారా పౌరులకు ఎలక్షన్ కమిషన్ 'ఈవీఎమ్'ల సమాచారం అందించవచ్చు. లేదా చట్టంలోని నిర్దేశిత ఉపనిబంధనల ప్రకారం సమాచారం నిరాకరించవచ్చు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ ముందు సవాల్ చేయవచ్చని అత్యున్నత న్యాయ నిర్ణేత అధికారం ఉన్న సీఐసీ స్పష్టం చేసింది.
ఈసీ వాదన
ఈ వాదనలపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఈవీఎమ్ యంత్రాల మోడల్, నమూనాల సమాచారం ఆర్టీఐ ద్వారా అందిస్తామని తెలిపింది. అయితే వీటిని శిక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తామని, సామాన్య ప్రజలకు వీటిని అందజేయలేమని స్పష్టం చేసింది.
ట్యాంపరింగ్ సంగతేంటీ?
అయితే ఈవీఎమ్ ట్యాంపరింగ్ వివాదాన్ని మాత్రం ఎలక్షన్ కమిషన్ ప్రస్తావించలేదు.
ఇటీవల కాలంలో వివిధ రాజకీయ పక్షాలు ఈవీఎమ్ ట్యాంపరింగ్ జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించాయి. ప్రజలకు ఈవీఎమ్‌ల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని విపక్ష నాయకులు పేర్కొన్నారు. మరలా పాత పద్ధతిలోనే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అయితే ఈ ప్రతిపాదనలను ఈసీ తోసిపుచ్చింది.
దీనిపై ఈసీఐతో సమావేశమైన ప్రతిపక్ష పార్టీలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రకటించే ముందు ఈవీఎమ్‌లో పోలైన 50 శాతం ఓట్లను వీవీపాట్ స్లిప్‌లతో సరిపోల్చాలని కోరారు.
కథాకమామీషు..
ఇటీవల ఓ ఆర్టీఐ దరఖాస్తుదారుడు ఎలక్షన్ కమిషన్ నుంచి 'ఈవీఎమ్' సమాచారాన్ని కోరాడు. ఈ అభ్యర్థనను ఎలక్షన్ కమిషన్ తోసిపుచ్చింది. ఇది సమాచారం హక్కు చట్టం కిందకు రాదని తెలిపింది. దీనిపై స్పందించిన ప్రధాన సమాచార కమిషనర్ సుధీర్ భార్గవ ఈవీఎమ్ సమాచారం ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తుందని, దానిని ఈసీఐ నుంచి పొందవచ్చని స్పష్టం చేశారు.
రజక్ ఖాన్ హైదర్ ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2 (ఎఫ్), 2(ఐ) నిబంధనల అమలుకై సవాల్ చేస్తూ సీఐసీని ఆశ్రయించారు. పై నిబంధనలు ప్రకారం సమాచారం ఏ రూపంలో ఉన్నా అది పౌరులకు అందించాలని, దానిని నిరాకరించడం చట్ట విరుద్ధమని సుధీర్ భార్గవ స్పష్టం చేశారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఆర్టీఐ సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం సమాచారం అనేది రికార్డ్స్, డాక్యుమెంట్స్, మెమోలు, ఈమెయిల్స్, ఒపీనియన్స్, అడ్వైజెస్, ప్రెస్ రిలీజ్లు, సర్క్యులర్స్, ఆర్డర్స్, లాగ్‌బుక్స్, కాంట్రాక్ట్‌లు, రిపోర్ట్లు, పేపర్స్, శాంపుల్స్, మోడల్స్, డేటా మెటీరీయల్, అవి ఎలక్ట్రానిక్ ఫాంలో ఇలా ఏ రూపంలో ఉన్నా అవి ప్రభుత్వ అధ్వర్యంలో ఉంటే ఆ సమాచారం ప్రజలకు అందించాలి.