మధ్యప్రదేశ్ సాత్నా జిల్లా చిత్రకూట్‌లో కవలల అపహరణ ఘటన విషాదాంతమైంది. ఈ నెల 12న అపహరణకు గురైన ఇద్దరి మృతదేహాలు ఉత్తరప్రదేశ్ బాందా జిల్లాలో యమునా నదిలో లభ్యమయ్యాయి.
పాఠశాలకు నుంచి ఇంటికి వెళుతున్న చిన్నారుల్ని గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారు. కిడ్నాపర్లు డిమాండ్ చేసిన మొత్తాన్ని తల్లిదండ్రులు చెల్లించినప్పటికీ... కవలల్ని క్రూరంగా హత్య చేశారు దుండగులు. చేతులు కట్టేసి నదిలోకి విసిరేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు పోలీసులు.
పెల్లుబికిన ఆగ్రహావేశాలు...
చిత్రకూట్‌లో కవలలు కిడ్నాప్ అయిన నాటి నుంచి వారు క్షేమంగా ఇల్లు చేరాలని ఎదురుచూశారు స్థానికులు. దుండగులు కవలల్ని పొట్టన పెట్టుకున్నారన్న వార్త విని స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. స్థానికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. భావోద్వేగానికిలోనై హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఆందోళనకారుల్ని అదుపుచేసేందుకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 1500మంది పోలీసుల్ని చిత్రకూట్‌కి తరలించారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు.