ఎయిర్‌సెల్-మ్యాక్సిక్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలకు దిల్లీ కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో అరెస్టుల నుంచి వారికి కల్పించిన మధ్యంతర రక్షణను మార్చి 9వరకు పొడిగించింది న్యాయస్థానం. ఎయిర్‌సెల్ మ్యాక్సిక్ కేసులో సీబీఐ, ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు చిదంబరం, కార్తీ.
కార్తీకి ఈడీ పిలుపు
మార్చి 5,6,7,12 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక న్యాయమూర్తి ఏపీ సైనీ కార్తీ చిదంబరాన్ని ఆదేశించారు. ఎయిర్‌సెల్ మ్యాక్సిక్ కేసులో కార్తీని మళ్లీ ప్రశ్నించనుంది ఈడీ.
ఈడీ ముందు హాజరు కావాలని గత నెల 30న సుప్రీంకోర్టు కూడా కార్తీని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం సూచనలను కార్తీ పాటించాలన్నారు సైనీ.
కేసును ఆలస్యం చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తుందన్నారు కాంగ్రెస్ నేత చిదంబరం.
చిదంబరం, కార్తీల తరపున కోర్టులో వాదనలు వినిపించారు న్యాయవాదులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, ఏ.ఎం.సింఘ్వీ.
ఐఎన్‌ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు అక్రమంగా మార్గం సుగమం చేశారని, ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించారని చిదంబరం, కార్తీలపై ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ, ఈడీలు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాయి.