ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుసగా జరుగుతోన్న కేబినెట్ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్రం. తాజాగా జరిగిన భేటీలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సహా వివిధ అంశాలకు ఆమోదం తెలిపింది.
జనపనారకు మద్దతుధర పెంపు...
జనపనారకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 3700 నుంచి రూ. 3950కి పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్రం.
చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై...
చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పాదకతను పెంచే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూలధన సబ్సిడీ, సాంకేతికత మెరుగుదలకు రూ. 2900 కేటాయించినట్లు వెల్లడించింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పోటీ తత్వం పెరిగేందుకు, నవీన ఆలోచనల్ని ప్రోత్సహించేందుకు, వృధాను తగ్గించేందుకు ఈ నిధులు ఉపకరించనున్నాయి.
ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, కొండ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా అండమాన్ నికోబార్, లక్షద్వీప్, తీవ్రవాద భావజాలం ఉన్న ప్రాంతాల్లోనూ ఈ నిధులను వినియోగించనున్నారు.
పట్నా మెట్రో రైల్...
బిహార్ రాజధాని పట్నాలో ప్రజా రవాణాను పెంచేందుకు ఐదేళ్లలో 2 మెట్రో కారిడార్లను పూర్తి చేయడానికి సంకల్పించింది కేంద్రం. ఈ మెట్రో ప్రాజెక్టుకు రూ. 13,365. 77 కోట్ల కేటాయింపులపై నిర్ణయం తీసుకుంది.
కిసాన్ మండీకి స్థల కేటాయింపు...
దిల్లీ పాల పథకం(డీఎంఎస్) పరిధిలోని 1.61 ఎకరాల స్థలాన్ని రైతు బజార్‌కు కేటాయించే అంశంపై కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్కెట్ ద్వారా ఆన్లైన్ సేవల్ని సైతం అందించనున్నట్లు పేర్కొంది.
సఫాయి కర్మచారీల జాతీయ కమిషన్ పదవీకాలంపైనా నిర్ణయం తీసుకుంది కేబినేట్. మూడేళ్ల పాటు ఈ కమిషన్‌ను కొనసాగించనుంది.