పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడి చేసిన భారత్ తదుపరి కార్యాచరణకు ప్రణాళికలు రచిస్తోంది. సైన్యం, వైమానిక దళ అధిపతులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ అయ్యారు. మెరుపుదాడి, తదుపరి కార్యాచరణపై సాయంత్రం 5 గంటలకు విదేశీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది.
నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన భారత్... దాయాది దేశానికి గట్టి సమాధానమిచ్చింది. భారత్ దాడి చేస్తుందని పాక్ ఊహించినప్పటికీ ఈ రీతిలో మెరుపు దాడి చేస్తుందనుకోలేదు. ఏకంగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కీలక స్థావరంపై దాడి చేసి నేలమట్టం చేసింది భారత వైమానిక దళం.
పాక్ తిరిగి కోలుకోలేని విధంగా అటు ఉగ్రవాద తండాలపై, ఇటు కశ్మీరులోని వేర్పాటు వాదులపై ఏకకాలంలో దాడి చేసింది భారత్. తమపై దాడి చేస్తే దీటుగా స్పందిస్తామని చెబుతూ వస్తోన్న పాకిస్థాన్ ఏ రీతిలో స్పందిస్తుందో చూడాలి. అయితే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సైన్యానికి, వాయుసేనకు నిర్దేశించారు.
డోభాల్ భేటీ...
సైన్యం, వైమానిక దళాధిపతులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ అయ్యారు.
బిపిన్ రావత్, బీఎస్ ధనోవాతో సరిహద్దు భద్రతపై డోభాల్ సమీక్షించారు. పాక్ ఎటువంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
అఖిలపక్ష సమావేశం...
పుల్వామా ఉగ్రదాడిపై వెనువెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించి పరిస్థితులను విపక్షాలకు విశదీకరించింది ప్రభుత్వం. అదే రీతిలో నేటి మెరుపు దాడిపై తక్షణమే అఖిలపక్షానికి తెలియజేసి వారి మద్దతు, సలహాలు తీసుకొని దాయాదికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వం యోచిస్తోంది.