పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం అమలును సులభతరం చేసేందకు జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్హెచ్ఏ) నడుం బిగించింది.
ఎన్హెచ్ఏ, భారత హెల్త్‌కేర్ ఫెడరేషన్ పరస్పర సహకారం అందించుకోవాలని ఇటీవల దిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.
నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ప్రధానమంత్రి జన ఆవాస్ యోజన(పీఎంజేఏవై) ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
ఈ పథకం ద్వారా వైద్యానికి సమకూర్చే ఖర్చు , చికిత్సా ప్రామాణాలను నిర్ణయించే అధికారం ఎన్హెచ్ఏకు ఉంది. ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
ఎన్హెచ్ఏకు కావాల్సిన సహకారం అందించేందుకు సాంకేతిక నిపుణలను ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతామని భారత హెల్త్‌కేర్ ఫెడరేషన్ అధ్యక్షుడు దల్జీజ్ సింగ్ స్పష్టం చేశారు.
మరిన్ని ప్రైవేటు సంస్థలు ఆయుష్మాన్ భారత్‌లో భాగస్వాములయ్యేలా చేసి నాణ్యమైన వైద్యం ఎక్కువ మంది ప్రజలకు చేరువయ్యేలా కార్యాచరణను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన వైద్యం కోసం... ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.5లక్షలు ప్రభుత్వం తరఫున కేటాయిస్తూ గతేడాది సెప్టెంబరులో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభమైంది. ఇప్పటివరకు 10లక్షల మందికిపైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.