2019 లోక్సభ ఎన్నికలకు ముందు సున్నితమైన అయోధ్య కేసు విచారణ తేదీని సుప్రీంకోర్టు ఖరారు చేసింది. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసును ఈనెల 26న విచారించనున్నట్లు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వాదనలు విననుంది.
అయోధ్య కేసుపై ఈ ఏడాది జనవరి 29న విచారణ జరపాలని సుప్రీంకోర్టు ముందుగా నిర్ణయించింది. కానీ.. ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ ఎస్ఏ బాబ్డే సెలవులో ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నట్లు జనవరి 27న ప్రకటించింది.
ఐదుగురు న్యాయమూర్తులు వీరే...
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగొయ్, జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ కేసును విచారించనున్నారు.
అలహాబాద్ హైకోర్టు తీర్పుపై వాదనలు
అయోధ్య కేసుపై 2010 అలహాబాద్ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంపై వాదనలు విననుంది సుప్రీంకోర్టు. అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్ లల్లాలకు సమానంగా పంచాలని అలహాబాద్ కోర్టు గతంలో తీర్పునిచ్చింది.