మీకు స్మార్ట్ ఫోన్ ఉందా? అందులో ఎన్ని యాప్స్ ఉన్నాయి? ఓ చాలానే ఉన్నాయి అంటారా. అయితే మీకోసమే ఈ వార్త.
మీ స్మార్ట్ ఫోన్లోని వ్యక్తిగత సమాచారం వివిధ యాప్‌ల ద్వారా ఫేస్‌బుక్‌కు మీకు తెలియకుండానే చేరుతుంది జాగ్రత్త. శరీర బరువు, ప్రెగ్నెన్సీ సమాచారం, షాపింగ్, రుతు చక్రం వంటి వ్యక్తిగత విషయాలూ ఇందులో ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది.
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఫేస్బుక్లో లేకపోయినా వారి సమాచారం ఆ సంస్థకు చేరుతుందని వెల్లడవడం మరో ఆందోళనకర అంశం. ప్రకటనల కోసం రూపొందించిన ఓ ప్రత్యేక టూల్ కారణంగానే ఇదంతా జరుగుతోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ గుర్తించింది.
ఈ నివేదికపై ఫేస్బుక్ స్పందించింది. ఎలాంటి సమాచారం ఇవ్వాలో నిర్ణయించాల్సిన బాధ్యత యాప్ డెవలపర్లదేనని చెప్పుకొచ్చింది.
"మాతో ఏం సమాచారం పంచుకుంటున్నారో యాప్ డెవలపర్లు వినియోగదారులకు స్పష్టంగా చెప్పాలి. యూజర్ల వ్యక్తిగత సమాచారం మాకు అందించడం నిషేధం. ఇప్పటికే షేర్ చేసిన అసంబద్ధ డేటాను గుర్తించి, తొలిగించేందుకు ప్రయత్నిస్తాం"
- నిస్సా అంక్లేసరియా, ఫేస్బుక్ అధికార ప్రతినిధి