భారత స్వీయ రక్షణ హక్కును అమెరికా సమర్థిస్తుందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ స్పష్టం చేశారు. ఈ మేరకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో ఆయన ఫోన్లో సంభాషించారు. పుల్వామా అమర వీరులకు సంతాపం తెలిపారు.
"ఈ రోజు నేను డోభాల్‌తో రెండు సార్లు మాట్లాడాను. భారత స్వీయ రక్షణకు అమెరికా మద్దతుంటుందని ఆయనకు చెప్పాను. ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికుల పట్ల అమెరికా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తోంది."_ బోల్టన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు
'జైష్ ఏ మహమ్మద్' ఉగ్రవాద సంస్థ, దాని స్థాపకుడు మసూద్ అజహర్‌కు పాకిస్థాన్ ఆశ్రయం ఇవ్వడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని డోభాల్, బోల్టన్‌కు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి సహకారం ఇస్తామని హామీ ఇచ్చారు.
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిలవడం, ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం వెంటనే విరమించుకోవాలని అమెరికా హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాద సంస్థలు, వాటి నేతలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలను తక్షణమే స్తంభింపజేయాలని పాకిస్థాన్‌కు హుకుం జారీచేసింది.
"తీవ్రవాదంపై పోరులో మేము భారత్‌కు తోడుగా ఉంటాం. అలాగే అంతర్జాతీయ భద్రతకు సవాలుగా నిలుస్తోన్న ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయమివ్వడాన్ని వెంటనే విరమించుకోవాలి." _మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి
సుమారు 70 మంది చట్టసభ్యులు, 15 మంది వరకు అమెరికా సెనేటర్లు పుల్వామా ఘటనను ఖండించారు. ఉగ్రవాద దాడులు భారత ప్రజల మనోధైర్యాన్ని సడలించలేవని వ్యాఖ్యానించారు.