మెరుపుదాడులతో తమ బలాన్ని ప్రపంచానికి తెలియజేసిన భారత సైన్యానికి దిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అభినందనలు వెల్లువెత్తాయి. సుష్మా స్వరాజ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ సహా పలు పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తామని అన్ని రాజకీయ పార్టీలు కేంద్రానికి హామీ ఇచ్చాయి.మెరుపుదాడుల కోసం చేపట్టిన ఆపరేషన్ను వారందరికి మంత్రులు వివరించారు. ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతుపై సంతోషం వ్యక్తం చేశారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. అన్ని పార్టీలు ఐక్యతను ప్రదర్శించాయని తెలిపారు.
ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భద్రతా దళాలకు పూర్తి మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. పౌరులకు హాని కలగకుండా కేవలం ఉగ్రవాదులను, ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యం చేసుకోవడంపై ఆజాద్ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
దేశంలో ఉగ్రవాదం నిర్మూలనకు సైన్యం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు.
"భారత సైన్యం తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము మద్దతిస్తాము. భారత సైన్యం శక్తిమంతమైనది. దేశంలో ఉన్న ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి, ఇతర దేశాల నుంచి వచ్చే ఉగ్రవాదులను హతమార్చడానికి మన భద్రతా దళాలకు మా పూర్తి మద్దతు ఉంటుంది."
---- గులామ్ నబీ ఆజాద్, కాంగ్రెస్ నేత.
మంగళవారం తెల్లవారు జామున జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్య మెరుపుదాడుల్లో 350 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.