భారత్-పాక్ మధ్య అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా మూసివేసిన 9 విమానాశ్రయాల నుంచి సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. శ్రీనగర్, జమ్ము, లేహ్, పఠాన్‌కోట్, అమృత్సర్, సిమ్లా, కాంగ్రా, కులుమనాలి, పితోర్‌గఢ్ విమానాశ్రయాల నుంచి ప్రస్తుతానికి సేవలు పునరుద్ధరిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది.
ఉదయం పాకిస్థానీ ఎఫ్-16 విమానాలు భారత గగనతలంలోకి చొరబడ్డాయి. కాసేపటికే విమానాశ్రయాల మూసివేతపై ప్రకటన వెలువడింది. నేటి నుంచి మే 27వరకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. కొద్దిగంటల తర్వాత సేవలు పునరుద్ధరిస్తున్నట్లు మరో ప్రకటన చేసింది.
భారత వాయుసేన ఆదేశాలను అమలు చేస్తున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. వారి ఆదేశాల ప్రకారమే మొదట విమాన సేవలు రద్దు చేశామని, అనంతరం పునరుద్ధరించామని తెలిపారు.
రైల్వేకు హెచ్చరికలు
రైల్వే భద్రతా దళాలన్నీ అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ ఆదేశించింది. అన్ని జోన్ల జనరల్ మేనేజర్లకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌కు రాకపోకలు సాగించే రైళ్లలో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించింది.
పాక్‌లో..
పాకిస్థాన్‌లో పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో భద్రతా చర్యలకు ఉపక్రమించింది ఆ దేశం. లాహోర్, ఇస్లామాబాద్, ఫైసలాబాద్, ముల్తాన్, సియాల్కోట్ తదితర విమానాశ్రయాల్లో జాతీయ, అంతర్జాతీయ సర్వీసులను నిరవధికంగా నిలిపివేసింది.
ఇదీ చదవండి: సరిహద్దులో టెన్షన్