1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో కీలక ముందడగు పడింది. కుట్రలో ప్రధాన నిందితుడు అబు బకర్ని ఆపరేషన్ ద్వారా దుబయ్‌లో అదుపులోకి తీసుకుంది భారత నిఘా బృందం. భారత్‌కు ఎప్పుడు తీసుకువస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఎవరీ అబు బకర్?
1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో కీలక సూత్రధారి అబు బకర్. ఘటన అనంతరం దేశం విడిచి పారిపోయాడు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో పేలుడు పదార్థాలపై శిక్షణ తీసుకున్నాడు. ఆర్డీఎక్స్, ఇతర పేలుడు సామాగ్రిని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సమకూర్చాడు. ముంబయి చేరుకొని మరో నిందితుడు ఫిరోజ్‌తో కలసి విధ్వంసకాండ సృష్టించాడు అబు బకర్.
వీరిద్దరికి ఎలా పరిచయం?
ఫిరోజ్, అబు బకర్కి ముంబయి పేలుళ్లకు నాలుగేళ్లకు ముందే అంటే 1989లోనే పరిచయం ఏర్పడింది. వీరు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వీసీఆర్ లాంటి వస్తువులు అక్రమమార్గంలో కొనుగోలు చేసి వాటిని దుకాణాలకు తక్కువ ధరలకు విక్రయించేవారు. 1993 పేలుళ్ల గురించిన పూర్తి సమాచారం ఫిరోజ్‌కు ముందుగానే తెలుసు.
ఘటన జరిగి ఐదేళ్లయింది...న్యాయం జరిగిందా...?
ముంబయి వరుస పేలుళ్లు జరిగి 25 సంవత్సరాలు దాటిపోయింది. దారుణమైన ఉగ్ర మూక కుట్రకు 257 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సూత్రధారి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులేనని కోర్టు తేల్చింది. కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.
⦁ 1995లో దావూద్ ఇబ్రహీం పై రెడ్ కార్నర్ నోటిసు జారీ.
⦁ 2007లో టాడా కోర్టు 100 మందిని దోషులుగా గుర్తించింది. తరువాత 23 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది.
⦁ 2017లో కీలక నిందితులు అబుసలేం, ముస్తఫా దోసాలకు శిక్ష విధించింది.
ఘటనపై విచారణ జరిగిందిలా..
1. మార్చి 12,1993 : ముంబయిలో 12చోట్ల బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి, 700 మందికి గాయాలు.
2. ఏప్రిల్ 19,1993 : బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ అరెస్టు
3. నవంబర్ 4,1993 : 189 మందిపై 10 వేల పేజీల ఛార్జి షీట్ దాఖలు
4. నవంబర్ 19,1993 : సీబీఐకి కేసు బదిలీ
5. మార్చి 20,2003 : నిందితుల్లో ఒకడు ముస్తఫా దిల్లీ విమానాశ్రయంలో అరెస్టు.
6. నవంబర్ 11,2005 : అబుసలేంను ఇండియాకు తీసుకొచ్చిన సీబీఐ.
7. జులై 30,2015 : కేసులో కీలక నిందితుడు యాకూబ్ మెమన్‌కు ఉరి.
8. ఫిబ్రవరి 13,2019: కుట్రలో సూత్రధారి, కీలక నిందితుడు అబు బకర్ దుబయ్‌లో అరెస్టు.