దేశంలో మొత్తం 16 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారని వెల్లడించింది ఓ సర్వే. మద్యం సేవిస్తున్న వారిలో 20శాతం మందికి మాత్రమే కావాల్సిన చికిత్స అందుతోందని తెలిపింది.
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ, ఎయిమ్స్ నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ (ఎన్డీడీటీసీ) 15ఏళ్ల తర్వాత ఈ సర్వే నిర్వహించాయి. ఇందుకోసం 186 జిల్లాల్లోని లక్షకు పైగా ఇళ్లకు తిరిగి సమాచారం సేకరించారు.
గంజాయి వాడకం అధికమే..
దేశంలో దాదాపు 3 కోట్ల మంది గంజాయి ఉత్పత్తులు తీసుకుంటున్నారని ఎన్డీడీటీసీ సర్వేలో తేలింది. అందులో 72 లక్షల మంది మత్తు పదార్థాలకు బానిసలయ్యారని వెల్లడైంది.
62లక్షల మంది మద్యంతో పాటు నల్లమందు, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు సేవిస్తున్నారని తేలింది.
38 మందిలో ఒకరికే..
మద్యం, మత్తు సేవిస్తున్న 38 మందిలో ఒకరికి మాత్రమే అవసరమైన చికిత్స అందుతోందని సర్వే వెల్లడించింది.
పంజాబ్, ఛత్తీస్గఢ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పడినవారు ఎక్కువ మంది ఉన్నారని సర్వే ద్వారా తెలిసింది. ప్రతి ఐదుగురిలో ఒకరికి చికిత్స అత్యవసరమని స్పష్టం చేసింది ఎన్డీడీటీసీ.