రంగవల్లిఎంత విస్తీర్ణంలో ఉంటుంది? గరిష్ఠంగా మన వాకిలి నిండా... కానీ మహారాష్ట్రలో 12 ఏళ్ల బాలిక మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ చిత్రపటాన్ని 11 ఎకరాల్లో వేసింది.
11 ఎకరాల రంగవల్లి
కోపర్గాంవ్ పట్టణంలో ఏడో తరగతి చదువుతోన్న బాలిక పేరు సౌందర్య బన్సోడ్. కోపర్గాంవ్ తాలుకాలో 'జంగల్ మహారాజ్ ఆశ్రమం' దగ్గర ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ రంగోలిని వేసింది ఈ బాలిక.
పేద కుటుంబమే అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు దీనికోసం మొత్తం రూ. 20 లక్షలు సమకూర్చారు. కూతురు లక్ష్యాన్ని నెరవేర్చటానికి నాన్న రుణం తీసుకోగా... అమ్మ నగలను తనఖా పెట్టింది.
రెండేళ్ల క్రితం ప్రపంచ రికార్డు సాధించాలని అనుకుంటున్నట్లు మాకు చెప్పింది. అప్పుడు మునుపటి రికార్డులను పరిశీలించాం. వ్యక్తిగత రికార్డు 1లక్ష చదరపు అడుగులు ఉంది. అది రెండున్నర ఎకరాలకు సమానం. బృందం రికార్డు 4 లక్షల ఎకరాలుగా ఉంది. ఇది 10 ఎకరాలకు సమానం. అప్పుడే 11 ఎకరాల విస్తీర్ణంలో శివాజీ చిత్రపటాన్ని వేయాలని నిర్ణయించుకుంది సౌందర్య.
-చిత్రకారుడు
ఛత్రపతి శివాజీ తన 14 ఏళ్ల వయస్సులో రాజయ్యారు. దీన్నుంచి స్ఫూర్తి పొందిన 12 ఏళ్ల సౌందర్య చిన్న వయస్సులో ఉన్నప్పటికీ తన వంతు ప్రయత్నం చేయాలనుకుంది. జనవరి 26 నుంచి ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ కళ కోసం శ్రమించింది. మొత్తం 250 టన్నుల ముగ్గుని దీనికోసం ఉపయోగించారు.
నేను రంగోలి గురించి మా నాన్నను అడిగినప్పుడు... మొదట ఇంటి స్లాబ్ మీద సాయిబాబా చిత్రపటం వేయమని చెప్పారు. దాని తరవాత మా పాఠశాల దగ్గరున్న మూడు ఎకరాల్లో శివాజీ మహరాజ్ బొమ్మను వేయమన్నారు. తదనంతరం 11 ఎకరాల్లో శివాజీ చిత్రపటాన్ని వేయటానికి ఒప్పుకున్నారు. -సౌందర్య బన్సోడ్