కడప జిల్లా పులివెందులలో ఆలయాల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇటీవల అంతర్వేదిలో రథం దహనం సంఘటన చోటుచేసుకున్న తర్వాత.. మరెక్కడా అలాంటివి పునరావృతం కాకుండా అన్ని గుడులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ దేవదాయశాఖ అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా చాలా ఆలయాల్లో చాలాచోట్ల నేటికి నిఘా నేత్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కడప, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల పరిధిలో సుమారు 125 ఆలయాలు ఉన్నాయి. వీటిలో 102 గుడుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసిన దాఖలాలే లేవు.విగ్రహాలకు అలంకరించిన వెండి, బంగారు ఆభరణాలు, హుండీలోని నగదుకు కనీస రక్షణ కరవైన పరిస్థితుల్లో దొంగల భయం వెంటాడుతోంది. సీసీ కెమెరాల ఏర్పాటుకు అయ్యే నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమవుతోంది. ప్రసిద్ధి చెందిన ఆలయాలు, అధిక ఆదాయం వచ్చే వాటిలో సైతం నిఘా కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అలాగే వాటి ఏర్పాటుకు ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయకపోవడంపై భక్తులు ఆవేదన చెందుతున్నారు.
చోరీలకు అడ్డుకట్టేదీ..?
జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో చాలా వరకు గ్రామం వెలుపల, కొండ కోనల్లో ఉన్నాయి. జనావాసాల మధ్య ఉన్న ఆయాల్లోనే తరచూ చోరీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాలకు దూరంగా ఉన్న వాటి పరిస్థితేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వేముల మండలంలోని మోపూరి భైరవేశ్వరస్వామి ఆలయంలో గత మూడేళ్ల క్రితం చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 2 కిలోల వెండి, రూ.25 వేలు నగదు అపహరించారు. రెండేళ్ల క్రితం పులివెందుల పట్టణంలోని మిట్ట మల్లేశ్వరస్వామి ఆలయంలో కూడా హుండీని పగలగొట్టి నగదు చోరీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి గుడిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
వీటికి రక్షణ ఏదీ..?
పులివెందుల శివారులోని శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన రంగనాథస్వామి ఆలయం, తూర్పు ఆంజనేయస్వామి, పడమర ఆంజనేయ స్వామి, నామాలగుండు, పంచలింగాల కోన వంటి ప్రముఖ క్షేత్రాల్లో సైతం రక్షణ కరవైంది.
*కడప నగరంలో దేవదాయశాఖ పరిధిలో సుమారు పది ఆలయాలు ఉన్నాయి. వాటిలో దేవుని కడప శివాలయం, మృత్యుంజయ కుంట, మోచంపేట శివాలయాలు, రాజేశ్వరి కోవెల తదితర ఆలయాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న ఆలయాల్లో మాత్రం నిఘా నేత్రాలు లేవు.
*కమలాపురం మండలంలో కంచి వరదస్వామి కోవెల, శివాలయం, పెద్దచెప్పలిలో శివ చెన్నకేశవస్వామి ఆలయం, చదిపిరాళ్లలో అగస్త్యేశ్వర స్వామి ఆలయాల్లో సీసీ కెమెరాలు లేవు.
*వేంపల్లెలోని వృషభాచలేశ్వరస్వామి ఆలయం, వేముల మండలంలోని మోపూరి భైరవేశ్వరస్వామి కోవెల, లింగాల మండలం పార్నపల్లె గ్రామంలోని కోనమల్లేశ్వరస్వామి, వెలిదండ్లలోని వరదరాజస్వామి ఆలయాలదీ అదే పరిస్థితి.
*పెండ్లిమర్రి మండలంలోని వెయ్యినూతల కోన, వల్లూరు మండలంలోని చెన్నకేశవస్వామి ఆలయం, వీరపునాయునిపల్లె మండలంలోని సంగమేశ్వరస్వామి ఆలయాలు రాయలసీమలోనే ప్రఖ్యాతిగాంచినవి. వీటిలో సైతం నిఘా కరవైంది.
ఆదాయం ఉన్నా అంతే...
దేవదాయశాఖ పర్యవేక్షణలోని చాలా ఆలయాలకు ఆదాయం బాగుంది. భక్తులు సమర్పించే కానుకల రూపంలో, ఆలయాల మాన్యం ద్వారా ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.35 లక్షలు వరకు ఆదాయం వస్తోంది. దీంతో వీటికి దొంగల నుంచి నిరంతరం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం
ఆదాయం ఎక్కువగా ఉన్న, ప్రముఖమైన ఆలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. రెండు నిఘా కెమెరాలకు రూ.20 వేల వ్యయం అవుతుందని అంచనా వేశాం. త్వరలోనే అన్ని ఆలయాల్లో వాటిని అమర్చేందుకు చర్యలు తీసుకుంటాం. - రమణ, దేవదాయశాఖ అధికారి, పులివెందుల