కడప జిల్లా ప్రొద్దుటూరులో పారిశుద్ధ్యం పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఎక్కడికక్కడ మురుగు... కాలువల్లో నిలిచిపోయింది. ఆ కాలువలు దోమలకు ఆవాసంగా మారి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. పట్టణంలో చాలాచోట్ల మురుగు పారేందుకు అవకాశం లేక రోడ్లపైకి వస్తోంది. అటుగా ప్రయాణించేందుకు పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్నిచోట్ల కాలువలకు ఆనుకుని ఉన్న మంచి నీటి పైపుల్లోకి మురుగునీరు చేరుతోంది. తాగు నీరు కలుషితమవుతోందని, అనారోగ్యాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రొద్దుటూరు పట్టణం నుంచి మురుగు బయటకు వెళ్లేందుకు 5 ప్రధాన కాలువలున్నాయి. నిర్వహణ లేమి కారణంగా కొంతమేర పూడిక పేరుకుపోగా... చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇంకొంత నిండిపోయాయి. ప్రధాన కాలువల్లో మురుగు ముందుకు కదలక అనుబంధంగా కాలువలు పొంగుతున్నాయి. కాలువల వద్ద పందులు స్వైరవిహారం షరా మూమూలైంది. కనీసం ఏడాదికి ఒక్కసారైనా శుభ్రపరిచిన దాఖలాలు లేవు. సరైన రక్షణ ఏర్పాట్లు లేక చిన్నారులు పడిపోయిన సంఘటనలూ ఉన్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.
ఇటీవల వర్షాలతో సమస్య తీవ్రత ఒక్కసారిగా పెరిగిందంటున్నారు అధికారులు. సాధ్యమైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపుతామంటున్నారు.