అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 3 కోట్ల 80 లక్షల మంది అర్హులైన ప్రజలకు 43 వేల కోట్ల నగదు బదిలీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పంటల బీమా నిధుల విడుదల సందర్భంగా కడప కలెక్టరేట్లో ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజద్ బాషా, జిల్లా కలెక్టర్ హరికిరణ్, రైతులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది రైతులకు బీమా ప్రీమియం సొమ్ము విడుదలైందన్న ఆయన... కడప జిల్లాలోని 2 లక్షల మంది రైతులకు 207 కోట్లు విడుదల చేశారని చెప్పారు.
ఏడాది పాలనలో ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే... ప్రతిపక్షాలు ఓర్వలేక బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నాయని మంత్రి సురేశ్ విమర్శించారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఆర్థికంగా నిలుదొక్కుకోవాలంటే వారి వద్ద డబ్బు ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్ నగదు బదిలీ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని... ఇలాగే వారి ప్రవర్తన ఉంటే భవిష్యత్తులో 23 సీట్లు కూడా రావని మంత్రి వ్యాఖ్యానించారు.అనంతరం జిల్లా రైతులకు విడుదలైన నిధుల చెక్కులను సంబంధిత రైతులకు అందజేశారు.