కడప జిల్లాలోని మైదుకూరు మినహా మిగతా మున్సిపాలిటీలను ఏకపక్షంగా కైవసం చేసుకున్న వైకాపా... ఒక్క మైదుకూరులో మాత్రం తీవ్ర ఉత్కంఠ మధ్య గట్టెక్కింది. మైదుకూరు మున్సిపాలిటీలో వైకాపా కంటే తెదేపా ఒక వార్డును అధికంగా గెలుచుకున్నప్పటికీ... ఛైర్మన్ పీఠాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. 24 వార్డులున్న మైదుకూరు మున్సిపాలిటీలో తెదేపా 12, వైకాపా 11, జనసేన ఒక వార్డును గెలుచుకున్నాయి.
గైర్హాజరుతో గట్టెక్కిన వైకాపా...
ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా వైకాపాకు చెందిన 11 మంది కౌన్సిలర్లను ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తీసుకురాగా.. తెదేపాకు చెందిన 11 మంది కౌన్సిలర్లూ మునిసిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తెదేపా నుంచి వైకాపా వైపు వెళ్లిన ఆరో వార్డు కౌన్సిలర్ మహబూబ్ బీ సమావేశానికి గైర్హాజరయ్యారు. జనసేన అభ్యర్థి కూడా సమావేశానికి రాలేదు. ఫలితంగా కార్యక్రమానికి హాజరైన 22 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో వైకాపా సంఖ్యాబలం 13 కు చేరింది.
చక్కని పాలనకు దోహదం...
ఫలితంగా వైకాపా తరఫున ఛైర్మన్ గా మాచనూరు చంద్ర ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పృథ్వితేజ్ ప్రకటించారు. ఉప ఛైర్మన్ గా షరీఫ్ ఎన్నికయ్యారు. మైదుకూరు మునిసిపాలిటీని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రజలకు చక్కని పాలన అందించడానికి ఈ విజయం బాగా ఉపయోగపడుతుందని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. గత మున్సిపల్ పాలకవర్గం మాదిరి కాకుండా నిజాయతీగా పాలన చేస్తామని ఛైర్మన్ మాచనూరు చంద్ర తెలిపారు. అనంతరం మైదుకూరు మునిసిపాలిటి నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎంపీ, ఎమ్మెల్యే అభినందించారు.
ఇదీచదవండి.