పశ్చిమగోదావరి జిల్లాలో రహదారుల దుస్థితి ఇదీ. ఏ దారి చూసినా ఇదే స్థితి. అడుగుకో గుంత. పది అడుగులకో గొయ్యి. రాత్రి వేళలు, వానాకాలంలో ఈ మార్గాల్లో ప్రయాణించాలంటే.. గుండె దిటువు చేసుకోవాల్సిందే. ఎందుకంటే.. ఎక్కడ ఏ గోతిలో పడతామో తెలియదు. అర్అండ్బీ, పంచాయతీరాజ్.. నిర్వహణ ఎవరిదైనా దుస్థితి ఒక్కటే.
పశ్చిమగోదావరి డెల్టాలో ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే 22కిలోమీటర్ల రహదారి.. ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. ఉండి, భీమవరం, పాలకొల్లు మీదుగా నరసాపురం వెళ్లే ఈ మార్గం.. పూర్తిగా గోతులమయమై పోయింది. సాధారణ ప్రయాణికులతో పాటు ఆక్వా ఉత్పత్తులు రవాణా అధికంగా ఉండే ఈ రోడ్డు ఛిద్రమై జనం అల్లాడిపోతున్నారు.
ఏలూరు నుంచి చింతలపూడి, జంగారెడ్డిగూడెం వెళ్లే రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నం. పెద్దపెద్ద గోతులతో కూడిన ఏలూరు - చింతలపూడి రోడ్డులో ప్రయాణం అంటే జనం జడుసుకుంటున్నారు. ఏలూరు - జంగారెడ్డిగూడెం మధ్య రోడ్డు పరిస్థితీ అంతే. కొన్నేళ్లుగా నరకం చూపుతున్న ఈ మార్గాలు... వర్షానికి మరింత పాడయ్యాయి. అందుకే ఆయా రూట్లలో వెళ్లే వాళ్లంతా క్షణమొక యుగంలా.. బిక్కుబిక్కుమంటూ ముందుకు సాగాల్సి వస్తోంది.
కొయ్యలగూడెం, గోపాలపురం రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అడుగడుగూ గుంతలతో చుక్కలు చూపుతున్న ఈ మార్గంలో వెళ్లడం కంటే ఇంటిదగ్గరే ఉండటమే మేలనే అభిప్రాయం ఉంది. మరీ అత్యవసరమైతే తప్ప.. ప్రయాణం పెట్టుకోకపోవడం ఉత్తమమని జనం అంటున్నారు. ఎంత పెద్ద గోతులు పడినా... కొద్దిపాటి మట్టి పోసి సరిపెడుతున్నారు. దీనివల్ల నెల తిరక్కముందే పరిస్థితి మొదటికొస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లాలో ఇతర రోడ్ల పరిస్థితీ దయనీయంగానే ఉంది. బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, అత్తిలి, తాడేపల్లిగూడెం, పాలకొల్లు నుంచి తణుకు, భీమవరం-నారాయణపురం.. ఇలా ఏ మార్గం చూసినా ఒకటే కథ. గుంతల రోడ్ల బారిన పడి 6 నెలల కాలంలోనే జిల్లా వ్యాప్తంగా 27మంది మృత్యువాత పడగా, 123మంది గాయపడ్డారు. అయినా రోడ్లు బాగుచేయాలనే స్పృహ యంత్రాంగంలో కొరవండిదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండీ.. Minor Ports in AP: 3 మైనర్ పోర్టుల ఎండీలుగా జేసీలు.. ఉత్తర్వులు జారీ