ఈ నెలాఖరు నాటికి నాడు-నేడు పనులను పూర్తి చేయాలని.. అధికారులను విజయనగరం కలెక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. మనబడి, నాడు-నేడు తొలిదశ పనులు, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, ప్రహరీల నిర్మాణం తదితర కార్యక్రమాలపై.. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా జరుగుతున్న పనుల గురించి వివిధ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నాడు-నేడు కింద తొలి విడతగా విజయనగరంలో 1,060 పాఠశాలలను ఎంపిక చేశామని జిల్లా విద్యాశాఖ అధికారిణి జి.నాగమణి తెలిపారు. సుమారు రూ. 125 కోట్ల రివాల్వింగ్ ఫండ్లో ఇప్పటివరకు రూ.115 కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టామని వెల్లడించారు. ఈ విషయంలో విజయనగరం రాష్ట్రంలోనే రెండవ స్థానంలో ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది 2,12,454 మందికి అమ్మ ఒడి వర్తించగా.. ఈ ఏడాదికి సంబంధించి డిసెంబరు 15లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. జనవరి 9న లబ్ధిదారులకు నగదు జమ చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. 301 మంది అనాధ పిల్లలకూ అమ్మ ఒడి నిధులు మంజూరయ్యాయని.. రూ.7,500 పిల్లలకు, అంతే మొత్తం ఆశ్రమ నిర్వహకుడి ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: