కొవిడ్ రెండోదశ ఉద్ధృతి నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం గత 12 రోజుల్లో 1300 టన్నుల వైద్య ప్రాణవాయువును సరఫరా చేసినట్లు కేంద్ర ఉక్కుశాఖ వెల్లడించింది. గత మూడు రోజులుగా రోజువారీ ఉత్పత్తిని 100 టన్నుల నుంచి 140 టన్నులకు పెంచినట్లు తెలిపింది. దేశంలో మొదలైన తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా 100 టన్నుల ద్రవీకృత ఆక్సిజన్ ఇక్కడినుంచి మహారాష్ట్రకు వెళ్లినట్లు పేర్కొంది.
సామర్థ్యానికి మించి...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఉక్కు కర్మాగారాల్లో సామర్థ్యానికి మించి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉక్కు పరిశ్రమల్లో ఉన్న 33 ఆక్సిజన్ ప్లాంట్ల రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 2,834 టన్నులు కాగా ఇప్పుడు దాన్ని 3,474 టన్నులకు పెంచారు. ఏ రాష్ట్రంలో ఉన్న స్టీల్‌ప్లాంట్లు ఆ రాష్ట్రానికి సిలిండర్లలో నింపి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నట్లు కేంద్ర ఉక్కుశాఖ తెలిపింది. విశాఖ ఉక్కు కర్మాగారం రికార్డు స్థాయిలో ఈనెల 24వ తేదీ శనివారం ఒక్క రోజే 3474 టన్నుల ద్రవరూప వైద్యపరమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసినట్టు జనరల్ మేనేజర్ ఆర్.పి. శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఇక్కడ 33 ఆక్సిజన్ ప్లాంట్లు ఉండగా వాటిలో 29 నిరంతరం పని చేస్తున్నాయన్నారు.
ఇదీ చదవండి: 'విశాఖ స్టీల్ ప్లాంట్ దేశానికి ఆక్సిజన్ సరఫరా చేస్తోంది'