నెల్లూరు జిల్లా సముద్ర తీర ప్రాంతంలో పులికాట్ సరస్సు 460 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ సరస్సులో చేపల వేటను నమ్ముకుని నెల్లూరు జిల్లాలోనే 25 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సముద్రం ఆటుపోటుల ద్వారా సరస్సులోకి నీటితోపాటు చేపలు వచ్చిచేరతాయి. నీటి ప్రవాహాన్ని అందించే సముద్ర ముఖద్వారాలు మూడు చోట్ల ఉన్నాయి. కానీ వాటిని ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ముఖద్వారాలు పూడిపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.
వర్షాకాలంలో మాత్రమే వరదనీరు వాకాడు మండలం పూడి రాయదొరువు వద్ద ఉన్న ముఖద్వారం నుంచి సరస్సులోకి చేరుతోంది. వరదలు రాకుంటే ప్రవాహం రాదు. కానీ తమిళనాడు పరిధిలోని పల్లవర్‌కాడు వద్ద అక్కడి ప్రభుత్వ పూడికలు తీయిస్తుండటంతో.. సరస్సులోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో అక్కడ మత్స్య సంపద పుష్కలంగా ఉంటోంది. ఆ ప్రాంతం ఆంధ్రా - తమిళనాడు సరిహద్దులో ఉన్నందున మన రాష్ట్ర మత్స్యకారులు కూడా వేటకు వెళ్తారు.
దీంతో తమిళనాడు, ఆంధ్రా మత్స్యకారుల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి. తమిళ మత్స్యకారులు ఇటీవల కిలోమీటర్ల పొడవునా తాటి మొద్దులు అడ్డం వేస్తున్నారు. వలలు, పడవలు ఎత్తుకెళ్ళడం, దాడులు చేయడం వంటివి చేస్తున్నారు. ఈ సమస్యలు పరిష్కరించడానికి.... రాయదొరువు వద్ద ముఖ ద్వారాన్ని తెరిపిస్తే జీవనోపాధి మెరుగవుతుందని మత్స్యకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
సరస్సులో వానపాములు, సున్నపుగుల్ల తవ్వకాలతో స్మగ్లర్లు కోట్లు గడిస్తున్నారు. విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. సరస్సులోని వానపాములు అంతరించిపోవడంతో.. చేపలు పెరగడం కష్టంగా ఉందని మత్స్యకారులు వాపోతున్నారు. సరస్సులోని ముఖద్వారాలు తెరిపించాలని ఐదేళ్లుగా పోరాటాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని... మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.
Jagananna Vidya Deevena: 'జగనన్న విద్యా దీవెన'.. నేడే రెండో విడత నిధుల విడుదల