తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ భౌతిక కాయానికి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వైకాపా ఎంపీ అయిన దుర్గాప్రసాద్ అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. నిన్న రాత్రి ఆయన పార్థివ దేహాన్ని స్వగ్రామమైన వెంకటగిరికి తీసుకువచ్చారు. స్థానికంగా ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అంతిమ క్రియలను పూర్తిచేశారు. తిరుపతి, సర్వేపల్లి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు, కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ, పలువురు నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు.
బండారు దత్తాత్రేయ సంతాపం
బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ విచారం వ్యక్తంచేశారు. ఆయన మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. దుర్గాప్రసాద్ తనయుడు శ్రీ కల్యాణ్‌తో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. ఎన్టీ రామారావును ఆదర్శంగా తీసుకుని పిన్న వయసులోనే రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదిగారని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
దుర్గాప్రసాద్‌కు వైకాపా నివాళి
అకాల మరణం చెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌కు వైకాపా నేతలు నివాళులర్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైకాపా నేతలు సంతాప సభ నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, శంకర నారాయణ, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. దుర్గాప్రసాదరావు మరణం పార్టీకి తీరని లోటని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్లమెంటులో రాష్ట్ర ప్రజల గళం వినిపిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం పరితపిస్తున్న వైకాపా ఎంపీల బృందలో ఒక సీనియర్ నేతను కోల్పోయామని అన్నారు. నెల్లూరు జిల్లా వాసిగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని మంత్రి శంకరనారాయణ అన్నారు.
ఇవీ చదవండి..