భూమా వర్సెస్ శిల్పా....
2014 ఎన్నికల్లో నంద్యాల స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. అనంతరం ఆయన మరణంతో 2017లో ఉపఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తెదేపా, వైకాపాతో పాటు అన్ని పార్టీలు పోటీలో ఉన్నాయి. నువ్వా - నేనా అన్న తరహా సాగిన ఈ పోరులో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా మరో అదృష్ట పరీక్షకు సిద్ధపడ్డారు. వైకాపా తరపున శిల్పా మెహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి బరిలో ఉన్నారు.
గెలుపుపై ప్రధాన పార్టీల ధీమా..!
కిందటిసారి ఎన్నికల్లో నంద్యాల వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి తెదేపాలో చేరారు. ఎన్నికల వేళ కర్నూలు సీటు ఆశించి భంగపడ్డ ఆయన గాజు గ్లాసు పట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో నంద్యాల వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పామోహన్ రెడ్డి ఈసారి బరిలో నిలవకుండా... కుమారుడు రవిచంద్రకిషోర్ రెడ్డిని బరిలో నిలిపారు. నంద్యాల నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధే మరోసారి సైకిల్ పార్టీ విజయానికి దోహదపడుతందని బ్రహ్మానందరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తెదేపా సర్కార్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని... ఈసారి ప్రజలు తమకే పట్టం కడుతారనే శిల్పా కుటుంబం ముందుకుసాగుతోంది. కొత్తగా వచ్చిన జనసేన ప్రచారంలో జోరు పెంచింది.
విలక్షణమైన తీర్పు ఇస్తారనే పేరున్న నంద్యాల ప్రజలు... ఈ సారి ఎన్నికల్లో సైకిల్‌కు పట్టం కడతారా...లేక ఫ్యాన్ పార్టీకి పగ్గాలు అప్పగిస్తారనేది కర్నూలు జిల్లా రాజకీయంలో ఆసక్తికరంగా మారింది.