కర్నూలు - గుంటూరు మధ్యనున్న ఘాట్ రహదారి గుంతలు పడి అధ్వాన్నంగా తయారైంది. నానా అవస్థలు పడుతూ 37 కి.మీ ప్రయాణం సాగించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రీయ రహదారిగా ఉన్న కర్నూలు - గుంటూరు రహదారి కొన్నేళ్ల క్రితం జాతీయ రహదారిగా మార్చారు. ఈ ఎన్‌హెచ్ 340-సీ రోడ్డు నల్లమల ఘాట్‌లో 37 కిలోమీటర్లు వ్యాపించి ఉంది. జిల్లా పరిధిలో 17 కిలోమీటర్లు ప్రకాశం జిల్లా పరిధిలో 20 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ రహదారి చిన్నపాటి వర్షాలకు గుంతలుగా మారింది. అటవీ ప్రాంతంలోని రోడ్డు, పక్కన బరమ్స్ మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడ్డాయి. వాహనాలు ఎదురెదురు వచ్చి రోడ్డు దిగితే అదుపు తప్పుతున్నాయి. ప్రతిరోజూ ఈ ఘాట్‌లో 1000కిపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం పది వేల మందికిపైగా ప్రయాణిస్తుంటారు.
నిధుల్లేక నిర్వహణ కరవు..
ఎన్‌హెచ్ 340-సీ నిర్వహణకు గతంలో నిధులు ఇచ్చేవారు. జిల్లా పరిధిలోని 17 కి.మీ.కు ఒక్కో కిలోమీటరుకు రూ.50 వేల చొప్పున మరమ్మతులకు ప్రతిపాదనలు చేశారు. అయితే ఇది రాష్ట్ర స్థాయి రోడ్లకే వర్తిస్తుంది. కేజీ రోడ్డు జాతీయ రహదారి కావడంతో ఈ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు సమాచారం. ఇలా ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క రూపాయి నిధులు కేటాయించకపోవడం గమనార్హం. దీంతో అధికారులు పూర్తిగా నిర్వహణ బాధ్యతను వదిలేశారు.
క్షేత్ర స్థాయిలో రోడ్డు గుంతలకు అతుకులు పడలేదు. మరోవైపు శివరాత్రి, ఉగాది పండగల సమయాల్లో మరమ్మతుల పేరుతో గ్రావెల్ బదులు మట్టిని తెచ్చి బరమ్స్‌కు ఉపయోగించి చేతులు దులుపుకొంటున్నారు. ఇక ఏపీఆర్డీసీ శాఖలో ఇద్దరు జేఈ, ఒక డీఈ పోస్టు ఖాళీగా ఉండటంతో సమస్యపై దృష్టి పెట్టే అధికారులు కరవయ్యారు. అదే విధంగా మలుపుల వద్ద పుటాకార దర్పణాలు ఏర్పాటు చేసినా ప్రస్తుతం పగిలిపోయాయి. ఇక లోయల వద్ద రక్షణ గోడలు సైతం దెబ్బతిని ప్రమాదకరంగా మారాయి.
ఆ ఘాట్‌లో ససేమీరా..
నిర్వహణ లోపం ఫలితంగా చిన్నపాటి వర్షం కురిసినా కేజీ రోడ్డు అధ్వానంగా మారుతుంది. వాహనాలు గుంతల్లో అదుపు తప్పి రోడ్డుకు అడ్డుగా పడుతున్నాయి. రాత్రుళ్లు భారీ లోడుతో వాహనాలు ఘాట్ ఎక్కలేక బోల్తా కొడుతున్నాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది. సిగ్నళ్లు లేక చరవాణులు పని చేయవు. ఆకలితో చిన్నారులు, అస్వస్థతకు గురయ్యే పెద్దలు ఇలా ఆ నరకయాతన వర్ణనాతీతం. దీంతో కొందరు వాహన చోదకులు ప్రకాశం, అమరావతి వెళ్లాల్సినవారు నంద్యాల-గిద్దలూరు ఘాట్ దారిలో ప్రయాణిస్తున్నారు. కర్నూలు నుంచి ఆత్మకూరు పరిధిలోని రోళ్లపెంట వరకు పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నాయి. ఘాట్‌లో ఏదైనా జరిగితే గస్తీకి వాహనాలు వెళ్లకపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తినా ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది.
కొన్ని సంఘటనలు..
గత నెల మొదటి వారంలో చిన్నపాటి వర్షానికి రోడ్డు అధ్వానంగా మారింది. ఎదురెదురుగా అధిక లోడుతో వస్తున్న రెండు లారీలను రోడ్డు దింపడానికి డ్రైవర్లు భయపడ్డారు. దాంతో నువ్వు దిగు అంటే.. నువ్వు దిగు అనుకుంటూ వాగ్వాదం చేసుకోవడంతో రెండు కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచి గంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. గతేడాది రోళ్లపెంట సమీపంలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో 10 గంటలకుపైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నీళ్లు దొరక్క, ఆహారం లేక వందలాది మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లారీ డ్రైవర్లు కొందరు వంట చేసి ప్రయాణికుల ఆకలి తీర్చారు.
విస్త‘'రణమే'’..
ఈ ఘాట్ రోడ్డును విస్తరించేందుకు గత తెదేపా ప్రభుత్వం నిర్ణయించినా అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో అడుగులు ముందుకు పడలేదు. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. నల్లమల అభయారణ్యం కావడంతో అనుమతి రాదనే ఉద్దేశంతో ప్రతిపాదనలే చేయకపోవడం గమనార్హం. దీనిపై ఏపీఆర్డీసీ ఈఈ ఇందిర మాట్లాడుతూ... రహదారి విస్తరణ ప్రస్తావన ప్రస్తుతం లేదన్నారు. జిల్లాలోని నాలుగు జాతీయ రహదారులకు కలిపి పొడవు, దెబ్బతిన్న రోడ్ల వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారన్నారు. దీనిపై కూడా ఇంకా స్పష్టత రాలేదని ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: