కొవిడ్ వ్యాప్తితో విధించిన లాక్ డౌన్ తరువాత.. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూచించిన శాశ్వత కేశఖండన శాల ప్రతిపాదనపై సభ్యులు చర్చించనున్నారు. ఇప్పటికే దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం అధికారులు దుర్గాఘాట్ లో రూ 29 కోట్ల వ్యయంతో కేశఖండన శాలకు భవనాల నిర్మాణం పై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేపట్టడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు.. మంత్రి పలుసూచనలు దేవస్థానం అధికారులకు చేశారు.
పాలకమండలి సమావేశానికి మూడు రోజులు ముందుగానే మంత్రి.. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, ఇరిగేషన్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. మంత్రి సూచనల మేరకు దుర్గగుడి శాశ్వత కేశఖండన శాల , ప్రసాదాల పోటు , మల్లేశ్వరాలయ అభివృద్ధి పనులపై మంత్రి సూచనలపై దేవస్థానం పాలకమండలి చర్చించనుంది. దుర్గమ్మ దర్శనానికి ఘాట్ రోడ్డు, మల్లికార్జున మహామండపం నుంచి వచ్చే భక్తులు రాజగోపుర మార్గం నుంచి మాత్రమే దర్శనం చేసుకునే విధంగా క్యూలైన్లు మార్చే అంశం ఎజెండాలో చేర్చినట్లు తెలిపింది. దసరా ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇప్పటివరకు ఖర్చుచేసిన దేవస్థానం నిధులపై చర్చించేందుకు సభ్యులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: రాష్ట్ర రాజ్‌భవన్‌లో భద్రతా సిబ్బందికి కరోనా