తూర్పుగోదావరి జిల్లాప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు రోగులు అధికంగానే వస్తూ ఉంటారు. ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి, శంకవరంతో పాటు గొల్లప్రోలు, కిర్లంపూడి, జగ్గంపేట ప్రాంతాల నుంచి ఇక్కడికి రోగులు వస్తుంటారు. పెద్దాసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా. రోజూ 400 నుంచి 500 మంది రోగులకు వైద్యం అందిస్తుంటారు. ఇద్దరు వైద్యులే ఉన్నా... రోగులకు వీలైనంత మెరుగ్గా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో జ్వరాలు అధికంగా ఉండటంతో.. ఆసుపత్రిలో రోగుల సంఖ్య బాగా పెరుగుతోంది.
రోజూ ఓపీ సేవల కోసం వచ్చే 400 నుంచి 500 మందికి... ప్రధాన వైద్యురాలు స్వప్నతో పాటు మరో వైద్యుడు రాహుల్ సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రిలో 30 పడకలే ఉన్నా.. ప్రతీరోజూ 30 నుంచి 40 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతుంటారు. మొత్తంగా రోజుకు 80 నుంచి 90 మంది ఇన్‌పేషెంట్లు ఉంటారు. ఊపిరి సలపనంతగా రద్దీ ఉంటున్నా సేవల పరంగా లోటు లేకుండా చూస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.
డాక్టర్లు మంచి వైద్యం అందిస్తున్నారని, నర్సులు కూడా బాగా చూసుకుంటున్నారని రోగులు అంటున్నారు. పెద్దాసుపత్రి స్థాయిలో సేవలు అందిస్తున్న సీహెచ్సీకి సరిపడా వైద్యుల్ని నియమించాలని సిబ్బంది, రోగులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: MPP elections : ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడిన చోట మళ్లీ నోటిఫికేషన్